చిచ్చు కాంగ్రెస్ పుణ్యమేనా?
హైదరాబాద్: మరో ఐదేళ్ళ తర్వాత మళ్ళీ తామే అధికారంలోకి రావటానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిం చిన కాంగ్రెస్ నాయకత్వం, ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే వ్యూహానికి పదును పెడుతున్నది. ఈ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం పార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించి ముఖ్యమైన నేతలందరినీ బయటకు పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
2004 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మందిని విజయవంతంగా పక్కకు తప్పించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడున్న ఏడుగురు ఎమ్మెల్యేలలో కొందరిని పక్కకు లాగాలన్న ప్రయత్నాలు ఫలించకపోవటంతో పార్టీలో అంతర్గతంగా చిచ్చు పెట్టి అధినేత కెసిఆర్‌ను నిర్వీర్యం చేయాలని, ఆరకంగా తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు అస్తిత్వం అనేదే లేకుండా చేయాలన్న వ్యూహంతో పని చేస్తున్నదని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేతలు కొందరు కపిలవాయి దిలీప్ కుమార్‌ను కేసీఆర్ సన్నిహితత్వం నుంచి తప్పించి వేరు కుంపటి పెట్టేలా చేశారు. ఆతర్వాత సిరి సిల్లలో కేసీఆర్ కుమారుడు కేటీ ఆర్‌పై పోటీ చేసిన అసమ్మతి నేత కెకె మహేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పాలమూరు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాసరెడ్డి, నల్లగొండ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ లాంటి వారిని పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేస్తే జిల్లాలలో టిఆర్‌ఎస్ నిర్వీర్యం అయిపోవటం ఖాయమన్నది కాంగ్రెస్ వ్యూహంగా టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 15 June, 2009
|