పార్టీలోకి రాహుల్ సేన!
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలిలో మంత్రి పదవుల అవకాశాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలోని యంగ్ టర్క్ లు (ఎక్కువ మంది మొదటిసారి ఎంపిలు) ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి)లో ప్రధాన పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రాలు, కులాలకు సమతూకంలో ప్రాతినిధ్యం లభించక పోవడంతో, ఎఐసిసిలో మార్పులు చేర్పులలో సమతుల్యత పాటించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ యువ నేతలకు మన్మోహన్ మంత్రివర్గంలో నామమాత్రంగా ప్రాతినిధ్యం లభించగా, ఎఐసిసిలో పార్టీ 'పోస్టర్ బాయ్' రాహుల్ గాంధి ముద్ర కనిపించగలదని భావిస్తున్నారు.
తన సన్నిహిత సహచరులు, ఎఐసిసిలో కార్యదర్శులు జితేంద్ర సింగ్, మీనాక్షీ నటరాజన్ లకు కీలక పదవులను కేటాయించాలని రాహుల్ భావిస్తున్నారని, సందీప్ దీక్షిత్, అశోక్ తన్వర్, ప్రియా దత్, మౌసమ్ నూర్, ప్రదీప్ మాఝిలకు కూడా సముచిత పదవులు లభించాలని ఆయన కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. అయితే, ఈ విషయంలో ఒక అవరోధం ఎదురుకావచ్చు. ఎఐసిసిలో యువతకు ప్రాతినిధ్యం కల్పించేందుకు రాహుల్ గట్టి ప్రయత్నమే చేయనున్నప్పటికీ నేరుగా భారీ స్థాయిలో ఎఐసిసి పదవులలోకి తమను తీసుకోవలసిందిగా యువ పార్లమెంటరీవేత్తలు కోరలేరు. 'ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల తరువాత మంత్రి పదవుల కోసం ఎదురు చూడవద్దని మాతో (రాహుల్) చెప్పారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మాకు ఎక్కువ సీట్లు రాని రాష్ట్రాలలో సంస్థ నిర్మాణమే మాకు ప్రధానం. ఇప్పుడు మంత్రివర్గం ఏర్పాటు పని పూర్తయినందున సంస్థలో మాకు సముచిత పాత్ర లభించగలదని ఆశిస్తున్నాం. కాని తుది ప్రకటనల కోసమే వేచి ఉండగలం. మా ఆకాంక్షలను బయటకు చెప్పుకోవడం ఇక్కడ నచ్చదు' అని యువ పార్టీ ఎంపి ఒకరు వివరించారు.
ఊహాగానాలు సాగుతున్నట్లుగా ఒకరికి ఒక పదవి అనే సూత్రాన్ని పార్టీ అనుసరిస్తే ఎఐసిసిలో చాలా ఖాళీలు ఏర్పడతాయి. ఎందుకంటే చాలా మంది సీనియర్ కార్యనిర్వాహక వర్గ సభ్యులను మంత్రి మండలిలో చేర్చుకున్నారు. ఈ నియమానికి పార్టీ కట్టుబడి ఉండేటట్లయితే, గులామ్ నబీ అజాద్, పృథ్వీరాజ్ చవాన్, జైరామ్ రమేష్, ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, వి. నారాయణ స్వామి వంటి నాయకుల స్థానాలలో వేరే వారిని నియమించవలసి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 16 June, 2009
|