ఆయన ఇప్పుడు జనం మంత్రి
మదురై : మదురై జిల్లా కలెక్టర్ కు పోటీ ఎదురైంది. ఈ పోటీ వేరే ఎవరి నుంచే కాదు. సాక్షాత్తు ప్రజల మంత్రి నుంచే. ఎం.కె. అళగిరి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మదురైకి తిరిగి వచ్చినప్పటి నుంచి కలెక్టరేట్ వెలుపల ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చే జనం సంఖ్య బాగా తగ్గిపోయింది. సాధారణంగా పిటిషన్ల సమర్పణకు వచ్చే జనంతో కలెక్టరేట్ ఆరుబయలు ప్రదేశం కిక్కిరిసి పోతుండేది. మరింత శీఘ్రంగా తమ సమస్యలు పరిష్కారం కాగలవనే ఆశతో వారు తమ పిటిషన్లను నేరుగా మంత్రి వద్దకు తీసుకువెళుతున్నారు.
వారం వారం తాను నిర్వహించే ముఖాముఖి కోసం సోమవారం ఉదయం వచ్చిన కలెక్టర్ ఎన్. మదివణన్ కు తన కార్యాలయం వెలుపల ఎప్పటి వలె కాకుండా జనం పలుచగా ఉండడం గమనించారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట ఆయనకు అందుకు కారణం బోధపడింది. పిటిషనర్లు మదురైలోనే మరొక చిరునామాలో, అంటే అళగిరి నివాసం వద్ద తమ ఫిర్యాదులు అందజేస్తున్నారని కలెక్టర్ కు తెలియవచ్చింది. మదివణన్ అర్థమైనట్లుగా తల పంకించి తనను చూడవచ్చినవారి వద్ద నుంచి పిటిషన్లు స్వీకరించి తన కార్యాలయంలోకి వెళ్ళిపోయారు.
అక్కడికి సుమారు ఏడెనిమిది కిలో మీటర్ల దూరంలోని టివిఎస్ నగర్ లో ఒక బంగళా వెలుపల షెడ్ లో ఫిర్యాదీల గొంతులు పెద్దవి కావడం, చిన్నవి కావడం జరుగుతోంది. జనం నుంచి పిటిషన్లు స్వీకరించి, పరిశీలించి, చర్య తీసుకోవడానికి ప్రాంతాల వారీగా వాటిని వేరు చేసే పనికి మంత్రి ఎక్కువ మందిని నియమించినట్లు అళగిరి సహాయకులలో ఒకరు తెలియజేశారు. 'వాటిని పరిశీలించి, సంబంధింత అధికారులకు తన సూచనలతో వాటిని పంపేందుకు ఆయన రోజూ కనీసం మూడు గంటలు వెచ్చిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆయన ఫోన్ లో నేరుగా వారితో మాట్లాడుతున్నారు' అని ఆ సహాయకుడు చెప్పారు.
అయితే, ఢిల్లీలో మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం కావడానికి బదులు మదురైలోనే మకాం వేయాలన్న అళగిరి నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యచకితులను చేసినప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడైన అళగిరి తనకున్న 'ఇమేజ్'ను మార్చుకుని ప్రజల మంత్రిగా పేరు సంపాదించడానికి తన మంత్రి పదవిని ఉపయోగించుకోవాలనే దృఢనిశ్చయంతో ఉన్నట్లున్నారు.
Pages: 1 -2- News Posted: 16 June, 2009
|