వైఎస్ఆర్ ముందు చూపు
హైదరాబాద్ : వరుసగా రెండవ సారి పాలన సాగించేందుకు తన నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిని పునరావలోకనంలోకి నెట్టినట్లు కనిపిస్తున్నది. తనకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పట్టిన గతి తనకు పట్టకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలో డాక్టర్ రాజశేఖరరెడ్డి సన్నిహిత సహచరులు సూచించినట్లు తెలుస్తున్నది. వరుసగా రెండుసార్లు పాలన సాగించిన తరువాత 2004లో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు ఉన్న అనంతరం కూడా వోటర్ల విశ్వాసాన్ని చూరగొనలేకపోయిన సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు.
2009 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ బొటాబొటి ఆధిక్యాన్నిసాధించడానికి గల కారణాల ఆధారంగానే వారు ముఖ్యమంత్రికి వివిధ సిఫార్సులు చేశారు. వాటిలో అత్యంత ప్రధానమైనది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంలో మరింతగా జవాబుదారితత్వాన్ని పాదుకొల్పడం. కొత్త మంత్రివర్గ తొలి సమావేశంలో మంత్రులకు కరాఖండిగా కొన్ని సూచనలు చేసిన అనంతరం డాక్టర్ రాజశేఖరరెడ్డి అధికారులకు, ముఖ్యంగా తన పేషీలోని అధికారులకు అటువంటి హెచ్చరికనే చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. తప్పు చేసిన అధికారులు ఏ హోదాలో ఉన్నప్పటికీ వారిపై కొరడా ఝళిపించే సూచనలు కనిపిస్తున్నాయి.
పూర్వపు తెలుగు దేశం పార్టీ (టిడిపి) ప్రభుత్వ పాలనతో తన పాలనను పోల్చిచూసుకోవలసిందని ఇక తాను ఎంత మాత్రం జనానికి సూచించలేనని కూడా డాక్టర్ రాజశేఖరరెడ్డి గ్రహించారు. ఇప్పటికే ఐదు సంవత్సరాలు పాలన సాగించినందున ఆయన రెండవ ఇన్నింగ్స్ లో పాలన సాగించే తీరును జనం బేరీజు వేసి చూస్తారు. అందువల్ల లోటుపాట్లను సరిదిద్దడం, వివిధ పథకాలు మరింత పకడ్బందీగా అమలు జరిగేట్లు చూడడం ఆయనకు తప్పనిసరి.
Pages: 1 -2- News Posted: 17 June, 2009
|