బంగళా కోసం జార్జి పాట్లు!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇటీవల లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు న్యూఢిల్లీ లుటియెన్స్ బంగళా జోన్ లో ఆయన నివసించే నంబర్ 3, కృష్ణ మీనన్ మార్గ్ బంగళాను పక్షం రోజులలోగా ఖాళీ చేయవలసిందిగా ఆయనకు నోటీసు జారీ చేశారు. ఆయన 19 సంవత్సరాలుగా ఆ బంగళాలో నివసిస్తున్నారు. తొమ్మిది సార్లు లోక్ సభ సభ్యుడుగా ఉన్న, అస్వస్థతతో బాధపడుతున్న ఫెర్నాండెజ్ ఇల్లు వదలి వెళ్ళడానికి మరి కొంత వ్యవధి అవసరమని ఆయనతో ఉంటున్న వారు గ్రహించారు. అయితే, ఆ వ్యవధి ఆయనకు కాదు కాని వారికే అవసరం.
అసలు సిసలు సోషలిస్టు అయిన జార్జి ఫెర్నాండెజ్ ఆ సువిశాల (టైప్ 8) బంగళాలో రెండు గదులలో మాత్రమే ఉంటున్నారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఆ బంగళాలో పది గదులు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ముజఫర్ పూర్ నుంచి వచ్చిన 11 కుటుంబాలు, వైద్య చికిత్స పొందుతున్న వారు, ఇద్దరు బర్మీస్ కళాకారులు మిగిలిన గదులలో ఉంటున్నారు.
తన జీవితమంతా కాంగ్రెస్ తో తీవ్ర స్థాయిలో పోరు సాగించిన జార్జి ఫెర్నాండెజ్ దానితో ఆరోగ్య కారణాలపై మరి ఆరు నెలల పాటు బంగళాలో బస చేసేందుకు అనుమతించవలసిందిగా అభ్యర్థిస్తూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. సరిగ్గా ఆరోగ్య కారణంపైనే ముజఫర్ పూర్ నుంచి పోటీ చేసేందుకు జార్జి ఫెర్నాండెజ్ కు టిక్కెట్ ఇవ్వడానికి ఆయన పార్టీ జనతా దళ్ (యు) నిరాకరించిన సంగతి విదితమే. 'ఆరు వారాల గడువు పొడిగింపు కోరుతూ నేను ప్రధానికి లేఖ రాశాను' అని జార్జి అంగీకరించారు. 'మాకు ఇంకా ప్రభుత్వం నుంచి సమాధానం రావలసి ఉంది' అని జార్జి సన్నిహిత సహచరుడు ఒకరు తెలిపారు.
'నేను స్వయంగా ప్రధానితో మాట్లాడి, జార్జి కోసం ప్రత్యేక అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశాను. ఎస్. జైపాల్ రెడ్డి (కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి) సముచిత చర్య తీసుకోగలరని ఆయన నాకు హామీ ఇచ్చారు. 50 సంవత్సరాల పాటు ఎంపిగా ఉన్న జార్జికి ప్రభుత్వం చేయదగిన కనీస సాయం ఇది' అని బన్కా ఎంపి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినందుకు జార్జిని, దిగ్విజయ్ సింగ్ ను వారి పార్టీ జనతా దళ్ (యు) బహిష్కరించింది.
'జార్జి నుంచి మాకు విజ్ఞప్తి అందింది. ఆరోగ్య కారణాలపై గడువు పొడిగింపు కోరారు. లిఖితపూర్వకంగా మేము ఏ హామీ ఇవ్వలేము. కాని లాంఛనంగా అందుకు ఏర్పాటు చేయగలం' అని జైపాల్ రెడ్డి చెప్పారు. బంగళా ఖాళీ చేసి వెళ్ళడంలో ఇబ్బందులు ఉంటాయని గుర్తిస్తూనే 'గత వైభవం గురించి కూడా కొంత ఆలోచించవలసి ఉంటుంది' అని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటువంటి ఔదార్యమా?! దీనిపై కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తూ, 'ఒక తరగతివారుగా రాజకీయ నాయకులలో అన్ని రంగాల ప్రజలలో కన్నా ఔదార్యం పాలు ఎక్కువగానే ఉంటుంది. పైగా జార్జి ఒక చరిత్ర పురుషుడు కదా' అని అన్నారు.
Pages: 1 -2- News Posted: 17 June, 2009
|