తెరాసలో ప్రక్షాళన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి తన పని తీరును మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదంతా మూణ్ణాళ్ళ ముచ్చటగా ఉంటుందా లేదా సర్వత్రా వచ్చిన విమర్శల నేపథ్యంలో తన వైఖరిని మార్చుకునేందుకు పార్టీ అధినేత కెసిఆర్ సిద్ధమయ్యారా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పుడే జవాబు లభించదు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా మూడు కమిటీలను నియమించాలని టిఆర్ఎస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా 13 నుంచి 15 మంది సభ్యులతో పొలిట్ బ్యూరోను, క్రమశిక్షణ వ్యవహారాల కమిటీనీ, కార్యక్రమాల కమిటీని త్వరలో నియమించనున్నారు. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారంపై ఇప్పటికే సమీక్షను ప్రారంభించారు. ఇంతవరకు 23 స్థానాల్లో సమీక్ష పూర్తయింది. గురువారం నుంచి వరుసగా పది రోజుల పాటు సమీక్షా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే అంటే జూలై మొదటి లేదా రెండో వారంలో మూడు కమిటీలను నియమించనున్నట్లు తెలిసింది.
టిఆర్ఎస్ ఇక రానున్న రోజుల్లో ఆచితూచి వ్యవహరించాలన్న విధానాన్ని అనుసరించనుంది. ఈ మేరకు తనకు సన్నిహితులతో కెసిఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా గిరిజన వర్గానికి చెందిన ఎంపి రవీంద్రనాయక్ విషయంలో గిరిజనులకు ఎమ్మెల్యే హరీష్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పారు. ఇకపై అసమ్మతి వర్గం విమర్శలకు స్పందించకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చినట్లు కనపడుతోంది. టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విలేఖర్ల సమావేశంలో రాజకీయంగా వారు అడిగిన ప్రశ్నలకు స్పందించడానికి నిరాకరించారు. కొత్తగూడెం బొగ్గు గనులపై ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. గురువారం ఏర్పాటు కానున్న తెలంగాణ విమోచన సమితి తనకు పక్కలో బల్లెంలా తయారవుతుందనే ఆందోళనలో టిఆర్ఎస్ నేతలున్నారు.
Pages: 1 -2- News Posted: 18 June, 2009
|