లాల్ గఢ్ బాటలో కోరాపుట్!
కోరాపుట్ (ఒరిస్సా) : కథ మామూలే. ముగింపూ అదే రీతిలో ఉండబోతున్నది. ఒరిస్సాలో అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లా కోరాపుట్ కు గడచిన ఐదు రోజులుగా మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇది మావోయిస్టులు 'విముక్తం' చేసిన మరొక ప్రాంతం కాబోయే ప్రమాదం తలెత్తింది. పశ్చిమ బెంగాల్ లోని లాల్ గఢ్ దీ ఇదే పరిస్థితి. అయితే, దానిని మావోయిస్టుల అధీనంలో నుంచి తిరిగి కైవసం చేసుకోగలిగారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు 560 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోరాపుట్ లో భూమి కోసం నిర్వాసిత గిరిజనులు ఒక వైపు, కబ్జాదారులు మరొక వైపు సాగిస్తున్న పోరు హింసాత్మక రూపు సంతరించుకుంటున్నది.
అక్కడ అధికార యంత్రాంగం లేకపోలేదు. కాని అది నామామాత్రావశిష్టంగా ఉన్నది. గిరిజనులు ఎంత మేరకు భూమి కోల్పోయారో ఎవరూ నిర్థారణగా చెప్పలేకపోతున్నారు. కాని, శాంతియుత పద్ధతుల్లో లేక దౌర్జన్య పద్ధతుల్లో వారు తిరిగి ఎంత భూమిని స్వాధీనం చేసుకున్నారో ఊహించి చెప్పవచ్చు. గిరిజనులు తమ ఫిర్యాదులను ఇక ఎంత మాత్రం స్థానిక అధికార యంత్రాంగానికి అందజేయడం లేదు. వారు నేరుగా మావోయిస్టుల అండ ఉన్న సంస్థల వద్దకు వెళుతున్నారు. వాస్తవానికి గిరిజనులు అసలు ఫిర్యాదులే చేయడం లేదనవచ్చు. వారు తమ వద్ద నుంచి కబ్జా అయిన భూములను తిరిగి లాక్కుంటున్నారు.
'వారు వచ్చి మా వ్యవసాయ భూమిలో ఎర్ర జెండా పాతుతారు. దానిపై మా హక్కు పోయిందనేందుకు అది సూచిక. నాకు 11 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పడు నేను మా బంధువుల ఇళ్ళలో దాక్కుంటున్నాను' అని బలిపేట గ్రామస్థుడు 72 సంవత్సరాల మధుసూదన్ పొండు చెప్పారు. నిర్వాసిత గిరిజనుల సంఘం 'చాసీ మూలియ ఆదివాసి సంఘ' (సిఎంఎఎస్) ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నట్లు స్థానికులు, అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ సంఘంలో గల మరింత రాడికల్ వర్గాల వల్లే ఈ ఆందోళన హింసాత్మక రూపు సంతరించుకుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు.
వారికి లక్ష్యంగా మారిన గిరిజనేతరులకు ఈ ప్రాంతం నుంచి పూర్తిగా నిష్క్రమించడం వినా మార్గాంతరం లేదు. ఇటీవలి కాలంలో నారాయణపట్న బ్లాక్ నుంచి సుమారు 200 మంది నిష్క్రమించినట్లు తెలుస్తున్నది. పొండు గ్రామమైన బలిపేట ఆ బ్లాక్ లోదే. నారాయణపట్న బ్లాక్ కు గడచిన ఐదు రోజులుగా మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సంఘ నాయకులు, కార్యకర్తలు నరికిన చెట్లను ప్రధాన రోడ్డుపై అడ్డంగా పడవేశారు. గురువారం ఆ రోడ్డును సుగమం చేయడానికి ప్రయత్నించిన ఒరిస్సా ప్రత్యేక సాయుధ దళం (ఒఎస్ఎస్ఎఫ్) సిబ్బంది తొమ్మిది మంది మావోయిస్టుల మందుపాతరకు బలయ్యారు. ఇప్పుడు నారాయణపట్న సమీపంలోకి వెళ్ళాలని పోలీసులు ఎవరూ అనుకోవడం లేదు.
Pages: 1 -2- News Posted: 22 June, 2009
|