ఐడి కార్డ్ ప్రాజెక్టులో నీలేకని
న్యూఢిల్లీ : దేశంలో రెండవ పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కో చైర్మన్ అయిన నందన్ నీలేకనిని తన బృందంలోకి చేర్చుకోవాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ యోచిస్తున్నారు. ఆయనకు ఏ విభాగాన్ని గాని, మంత్రిత్వశాఖను గాని అప్పగించరు. కాని ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను ఇవ్వజూపవచ్చు.
ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి భారతీయునికి ఒక విలక్షణమైన గుర్తింపు (యుఐడి) కార్డును సమకూర్చడమనే యుపిఎ ప్రభుత్వ బృహత్ ప్రాజెక్టుకు నీలేకని అత్యంత అనువైన మార్గదర్శి కాగలరని భావిస్తున్నారు. 2011లో జాతీయ జనాభా రిజిస్టర్ ను ప్రచురించిన తరువాత ఈ ప్రాజెక్టు సాధ్యం కాగలదని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. భద్రతాపరమైన ఆందోళనలను తీర్చడమే కాకుండా యుఐడి ప్రాజెక్టు లబ్ధిదారులకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు, సేవలను అందజేసే యంత్రాంగాన్ని క్షాళన చేయడమే కాకుండా మార్గదర్శనం కూడా చేయగలదు.
ఇంతకు ముందు ప్రణాళికా సంఘం (సహాయ మంత్రి హోదాతో) సభ్యుల నియామకం సమయంలో నీలేకని పేరుపై చర్చ జరిగింది. అయితే, యుఐడి వంటి బృహత్ ప్రాజెక్టుకు నీలేకని స్థాయి, యోగ్యత గల ప్రొఫెషనల్ అవసరమని ప్రభుత్వం ఇప్పుడు భావించింది. 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' విలేఖరి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఈ విషయమై ఏ వ్యాఖ్య అయినా చేయదలచుకోలేదని చెప్పారు. 'దీనిపై నేను మాట్లాడదలచుకోలేదు' అని ఆయన చెప్పారు. అయితే, ఆయన ఈ ప్రాజెక్టు గురించి చర్చించారని, అవకాశం లభిస్తే దీనిని చేపట్టేందుకు అంగీకరించవచ్చునని అధికార వర్గాలు సూచించాయి.
Pages: 1 -2- News Posted: 22 June, 2009
|