చిరంజీవి రాజీనామా?
హైదరాబాద్ : గడచిన ఎన్నికల్లో ప్రజారాజ్యం 18 సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో ప్రతిపక్షంగా అవతరించినా ఆ సంతోషం ఆ పార్టీకి ఎంతో కాలం నిలువలేదు. పార్టీ స్థాపించిన దగ్గరి నుండి నేటి వరకూ పార్టీలోకి వచ్చిన వారు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందే పిఆర్పీలో ఒక భాగస్వామిగా సాధించిన పరకాల ప్రభాకర్ పార్టీకి దూరమయ్యారు. అదే విధంగా మరో భాగస్వామిగా పేరుపొందిన డా.మిత్రా సైతం పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరి రాజీనామాల్లో తేడా లేకపోయినప్పటికీ వీరు వెళ్ళిపోయిన తీరులో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. పరకాల తీవ్ర ఆరోపణలుచేస్తూ పార్టీని వీడితే, మిత్రా మాత్రం తన కుటుంబ కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వ్యూహకర్తలిద్దరూ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో పార్టీలో కీలకమైన అధ్యక్షబాధ్యతలు నిర్వహిస్తున్న అధినేత చిరంజీవి సైతం ఆపదవికి రాజీనామా చేసి బాధ్యతలను దేవేందర్ గౌడ్ కు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పార్టీలో ఆర్థిక లావాదేవీల నుంచి ప్రతి ఒక్క విషయాన్ని దేవేందర్ గౌడ్ పై పెట్టేందుకు చిరంజీవి యోచిస్తున్నారు. పార్టీ భవిష్యత్ నిర్మాణంలోనూ దేవేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి పార్టీలో చిరంజీవి కేవలం శాసనసభ్యునిగానే ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో తెరవెనుకనే ఉంటూ పార్టీ ప్రణాళికలను రూపొందిస్తారు. ఇదిలా ఉండగా మిత్రా బాటలో పయనించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. మిత్రా ఏర్పాటు చేసిన స్పార్క్ సంస్థలో ఉండే వారుకూడా మిత్రా బాటలోనే పయనించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విధంగా స్పార్క్ సంస్థల నాయకులు ప్రజారాజ్యాన్ని వీడేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా పార్టీని వీడిపోయేవారు వీడిపోతుంటే అధినేత మాత్రం మౌనం వహిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 23 June, 2009
|