`ఎల్ నినో' కబళిస్తోంది
న్యూఢిల్లీ : అనావృష్టితో దుర్భిక్షాన్ని సృష్టించి, దేశ ఆర్ధిక పరిస్థితులను తల్లకిందులు చేయగల `ఎల్ నినో' ఈ ఏడాది మరోసారి దేశంపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే రుతుపవనాలు విఫలం అయిన నేపధ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ ఎం వో) చేసిన హెచ్చరిక మన నిపుణుల, నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. `ఎల్ నినో' ప్రభావం చూపించే సంవత్సరంగా పేర్కొనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగమైన డబ్ల్యూ ఎం వో హెచ్చరించింది. కొంత కాల వ్యవధిలో వాతావరణంలో `ఎల్ నినో' ప్రభావం వస్తోంది. పసిఫిక్ జలాలు వేడెక్కడం, దక్షిణ అమెరికా నుంచి ఆగ్నేయాసియా వైపుగా వీచే గాలులు బలహీనపడటం `ఎల్ నినో' ఏర్పడడానికి కారణాలు. ఇది ఏర్పడినప్పుడల్లా మన దేశంలో రుతుపవనాలు బలపడకుండా అడ్డుకుంటుంది. ఈ యేడాది ఎల్ నినో ఏర్పడటానికి యాభై కంటే ఎక్కువ శాతమే అవకాశం ఉందని డబ్ల్యూ ఎం వో పేర్కొంది. గతంలో కంటే ఇది రెండితల ప్రమాదంగానే పరిణమించనుంది.
ప్రపంచాన్ని ఆర్ధిక మాంద్యం దారుణంగా కృంగదీస్తున్న సమయంలో కూడా భారతదేశం దాని ప్రభావం ఛాయలు కనపడకుండా తలెత్తుకుని గర్వంగా నిలబడింది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయరంగంలో గణనీయమైన ఉత్పత్తులను సాధించడమే. గడిచిన రెండు త్రైమాసికల్లో కూడా వ్యవసాయరంగమే ఆర్ధిక స్థిరత్వానికి మార్గాలుగా నిలిచాయి. వ్యవసాయరంగం ఇదే ప్రగతిని కనబరిస్తే దేశ ఆర్దిక వృద్ధిరేటు గౌరవప్రదంగానే ఉంటుందని నిపుణులు భావించారు. కాని డబ్ల్యూ ఎం వో హెచ్చరికతో ఈ అంచనాలను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఈ హెచ్చరిక రావడానికి ముందే రెండు వారాల పాటు రుతుపవనాలు విఫలం కావడం, దాని ప్రభావాన్ని కూడా ప్రభుత్వం గమనించే ఉంది.అంతే కాక బంగాళా ఖాతంలో ఏర్పడిన ఐలా తుపాను నైరుతీ రుతుపవానాలను మింగేసింది. దాంతో మధ్య, ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు జూన్ 17 నాటికి దేశంలో 72.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాలి. కాని ఈ యేడాది కేవలం 39.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడింది. అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ పడింది. ఎల్ నినో ప్రభావంతో రోబోయే మూడు నెలల్లో రుతుపవనాలు మరీ బలహీనమై అనావృష్టి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 23 June, 2009
|