సమీక్షలతో సయోధ్య
హైదరాబాద్ : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో గట్టి పోటీని ఎదుర్కొని అతికష్టం మీద గట్టెక్కిన అధికార పార్టీ కాంగ్రెస్ కు జిల్లాలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు, వర్గ కుమ్ములాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా జిల్లాల్లో మంత్రులు, పాలకపక్షం ఎమ్మెల్సీల మధ్య కొరవడిన సమన్వయం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కొంప ముంచుతుందోననే భయం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ లను వెంటాడుతున్నది. అందుకే ఒకవైపు సిఎం ఆయా జిల్లాల నేతలను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండగా, మరో వపు పీసీసీ చీఫ్ డీఎస్ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రెండు సమీక్షల్లో కూడా వైఎస్, డిఎస్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, జిల్లా నేతలు, కార్యకర్తలతో సంబంధాలు వంటి అంశాల పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోమూడు నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ముంచుకొస్తుండడం ఆ తరువాత వచ్చే ఏడాది పంచాయితీ ఎన్నికలు ఉన్న దరిమిలా మంత్రులు, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు, కుమ్ములాటలతో పార్టీకి నష్టం ఏర్పడకుండా వైఎస్, డిఎస్ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విభేదాలు ఎన్ని ఉన్నా వాటిని పక్కనపెట్టి స్థానికంగా పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని వారు పదే పదే పార్టీ నేతలను కోరుతున్నారు. గ్రూపులు, వర్గాలను ప్రోత్సహిస్తున్న వారిపై కూడా వైఎస్ డిఎస్ కన్నేసి ఉంచినట్లు సమాచారం.
జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తగాదాల పంచాయితీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గతంలో వైఎస్ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అలాంటి వైఖరి వల్ల మొన్నటి ఎన్నికల్లో పార్టీకీ కొంత నష్టం కలిగినట్లు పార్టీ నాయకత్వం గుర్తించింది. మళ్ళీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచి డిఎస్, వైఎస్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఏర్పాటైన వైఎస్ మంత్రి వర్గంలో ఆయా జిల్లాల నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురేసి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారు. వివిధ జిల్లాల్లో పాత మంత్రులే మళ్ళీ ఆ పాత్రలు పోషిస్తుండగా, కొన్ని జిల్లాల్లో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు మంత్రి పదవులిచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న దూరం ప్రతిపక్షానికి ఎక్కడ అనుకూలంగా మారుతుందోననే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 24 June, 2009
|