`స్థానికం'లో సుస్థిరం
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించడం కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తును మొదలుపెట్టింది. నియోజకవర్గాల స్థాయిలో పార్టీని పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. సమర్థుడైన ఒక నాయకుడ్ని ఎంపిక చేసి అతనికి నియోజవకవర్గ బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో కూడా చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయగా 156 స్థానాలను గెలుచుకుంది. 138 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాగూ వారే తమ నియోజకవర్గం బాధ్యతలను చేపడతారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇంచార్జులను నియమించి వారి ద్వారా కథ నడిపిస్తారు. ఓటమి చెందిన 138 మంది అభ్యర్థుల్లో యాభై శాతం మంది మాత్రమే తమ నియోజకవర్గ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి సన్నిహితులు ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సమర్థులైన కొత్తవారిని ఎంపిక చేసి వారికి బాధ్యతలను అప్పగిస్తారు.
2010 మున్సిపాలిటీలకు, 2011 పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇంచార్జులుగా ఎంపిక చేసిన వారు తమ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు తగిన సమయం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపించిన ఇంచార్జులకు రాబోయే అంసెబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించలేని ఇంచార్జులను తొలగించి కొత్త వారికి ఆ బాధ్యతలను అప్పగిస్తారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను గెలిపిస్తేనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్టు ఇస్తామని, లేని పక్షంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి, నియోజకవర్గ ఇంచార్జుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. ఇలా చేయడం వల్ల నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం మొత్తం ఇంచార్జికి సహకరిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 29 June, 2009
|