చిత్తైన సీనియర్లు
హైదరాబాద్ : దశాబ్దాలపాటు రాష్ట్ర రాజకీయాలలో చతురులైన నాయకులుగా చక్రం తిప్పిన పెద్దలు ఇప్పుడు చతికిల పడ్డారు. అధికారాన్ని అందుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ ఆడిన రాజకీయ వైకుంఠపాళీలో ఈ నాయకులు తమకు తామే పాములనోటికి చిక్కారు. అధికారంలో ఉన్న స్వక్షీయులను ఎప్పుడూ ఇరకాటంలో పెట్టడమే రాజకీయంగా భావించిన వారు ఇప్పుడు అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తున్నారు. అయినా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో వృద్ధనాయకుల కాలం చెల్లిపోయినట్టే కనిపిస్తోంది. అన్ని పార్టీలూ యువరక్తం నినాదాన్ని అందుకున్నాయి. సీనియర్లతో ప్రజలకు మొహం మొత్తేసిందని యువకులకు, మహిళలకు రాజకీయాలలో ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ అన్ని పార్టీలలోనూ పెరిగిపోయింది. సీనియర్లకు చాకచక్యంగా చెక్ పెట్టిన వైఎస్ అంతే చాతుర్యంతో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, మహిళలకు కీలకమైన పదవులు కట్టబెట్టడం వంటి ప్రజామోద పనులు చేపట్టారు.
రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు ఎంత అవసరమో మాటల విషయంలో నిగ్రహమూ అంతే ముఖ్యమని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికి అర్థం చేసుకొనే ఉంటారు. మొన్నటి వరకు తెలంగాణ అంశంతో వైఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన సీనియర్లు నోరు మెదపలేని పరిస్థితిని వారికివారే తెచ్చుకున్నారని పార్టీ వర్గాలలో చర్చసాగుతోంది. ఎన్నికలకు ముందు ప్రదర్శించిన మాటల దూకుడే ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం అని అర్థమవుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక పార్టీలో గ్రూపు రాజకీయాలను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ సెంటిమెంటు పేరుతో కాంగ్రెస్ సీనియర్లు ఆయన్ని ఇబ్బందులకు గురి చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై సిఎంను ఈ సీనియర్ నేతలు విమర్శలు చేశారు.
స్వపక్షంలోనూ విమర్శలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై తాము చేస్తున్న అవినీతి ఆరోపణలలో వాస్తవం ఉందని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఈ పరిణామాలతో వైఎస్ పార్టీలోనే కాక ప్రతిపక్షాల నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్ ప్రదర్శించిన చాతుర్యతను సీనియర్లు ప్రదర్శించలేక పోయారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా సమయం సందర్భం లేకుండా తెలంగాణ అంశంతో వైఎస్ పై చేసిన దాడీ కాంగ్రెస్ సీనియర్లను అస్త్రసన్యాసం చేయింయింది.
Pages: 1 -2- News Posted: 30 June, 2009
|