అర్థం కాని కేసీఆర్
హైదరాబాద్ : చిత్రవిచిత్ర పోకడలకు కేసీఆర్ పెట్టింది పేరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే ప్రధాన ఎజెండాగా ఆయన పెట్టిన తెరాసలో తాజా ఎన్నికలు తెచ్చిన చిచ్చు ఇంకా ఆరనే లేదు. తిరుగుబాట్లతో నగుబాటు పాలైన తెరాసను గాడిలో పెట్టడానికి కేసీఆర్ పోతున్న పోకడలు ఆయనను వెన్నంటి ఉన్నవారిలో సైతం ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఆయన వ్యూహాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ అంతుపట్టదు. ఎప్పుడు ఎవరిపై వేటు వేస్తారో, ఎవరిని అక్కున చేర్చుకుంటారో ఎవరూ చెప్పలేరు. తాజాగా కొద్ది రోజుల క్రితం అసమ్మతి నేతలుగా ముద్ర పొందిన ఐదుగురిపై బహిష్కరణ వేటు వేసి ఆయన సంచలనం సృష్టించారు. అది జరిగిన కొద్ది రోజులకే వారందరినీ అక్కున చేర్చుకుని సంక్షోభం సమసిపోయిందన్నారు. అలాగే గత ఏడాది ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తక్షణం గద్దె దిగిన ఆయన, ఈసారి ఘోర పరాజయం అనంతరం రాజీనామా చేయాలని డిమాండ్ కొద్ది మంది నేతల నుంచి వెల్లువెత్తినా చాలా రోజులు మౌనం పాటించారు.
ఆ తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి మూడు రోజులు డ్రామా నడిపించారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయించి జై కొట్టించుకుని, అందరి అభీష్టం ప్రకారం ఉపసంహరించుకుంటున్నానన్నారు. ఇదంతా ఫార్స్ అని వెక్కిరించిన అసమ్మతి నేతలకు విందు భోజనం పెట్టి మరీ పార్టీలకి రప్పించుకున్నారు. ఈ తాజా వ్యూహం వెనుక కేసిఆర్ చాలా ఆలోచించారని సీనియర్ నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. అసమ్మతి నేతలను బయట ఉంచి రోజుకో రకమైన విమర్శకు తావిచ్చే కన్న పార్టీలో ఉంటే ఇక వారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిని కల్పించవచ్చునన్న వ్యూహాన్ని ఈసారి కెసిఆర్ అనుసరించినట్టు వారు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 30 June, 2009
|