కొరివిగా మారిన యాదవ్
హైదరాబాద్ : కోరి తెచ్చుకుంటే కొరివిగా మారి కొంపకి నిప్పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు తలలు బాదుకుంటున్నారు. పార్టీకి అనుకూలుడూ, మనోడు, మంచోడు అని నెత్తికెక్కించుకుంటే తలనొప్పులు తప్పడం లేదని వాపోతున్నారు. డీజీపి యాదవ్ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రికి సైతం అసహనాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. యాదవ్ సంగతి బాగా తెలిసే ఎన్నికల సంఘం అతనిని పదవి నుంచి తప్పించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిఎం వైఎస్ ఏరికోరి మళ్ళీ ఆయనకి పీఠం కట్టబెట్టారని ఇది యాదవ్ కు ఎక్కడ లేని బలాన్ని ఇచ్చిందని ఐపీఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏం చేసినా అడిగేవారెవరన్న రీతిలో యాదవ్ వ్యవహారశైలి ఉందని చెబుతున్నారు.
అత్యున్నత స్థానాన్ని తిరిగి దక్కించుకున్న యాదవ్ సున్నితంగా వ్యవహరించడం మానేశారని, ఏకంగా ఎన్నికల సంఘంతోనే వివాదాన్ని తెచ్చుకున్నారని దీనిని పరిష్కరించడానికి స్వయంగా ముఖ్యమంత్రే కలుగజేసుకోవాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. మంత్రులను లెక్కచేయకపోవడం, ముఖ్యమంత్రికి సైతం విసుగుతెప్పించేలా ప్రవర్తించడం మొదలైందని చివరికి ఈ తీరు ఆయనకు ఎసరు పెట్టడం తథ్యమని చెబుతున్నారు. రాష్ట్ర డిజిపి ఎస్ ఎస్ పి యాదవ్ ప్రభుత్వానికి క్రమంగా దూరమవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం పలువురు మంత్రులకు రుచించడం లేదు. అంతర్గతంగానూ ఆయన చర్యలు సీనియర్ అధికారులకు ఇబ్బంది కల్గిస్తున్నాయి. ప్రజలకు, పత్రికలకూ దూరంగా ఉంటున్న వైనంపై కూడా ప్రభుత్వం ఆయన పట్ల కొంత అసహనంగా ఉన్ననట్టు కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 1 July, 2009
|