100 డే 'హానీమూన్' వద్దు!
న్యూఢిల్లీ: రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన 'ఉపా' సంకీర్ణ సర్కార్ మంచి జోరుమీద కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 100 రోజుల్లో పరిపాలనను మెరిపిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతికి వాగ్దానం చేశారు. దీనికి అనుగుణంగా ఆయన మంత్రివర్గ సహచరులు వారి వారి మంత్రిత్వ శాఖల కింద చేపట్టబోయే అభివృద్ధి పథకాలు, సంస్కరణలను హడావిడిగా ప్రకటించేశారు. అయితే వినూత్నమైన, వినసొంపైన ఈ ఆలోచనలపై విస్తృతంగా చర్చ జరగకుండా అమలు చేస్తే అవి ప్రతికూల పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రజా విధాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యా రంగంలో పరీక్షల విధానాన్ని ఆసాంతంగా సంస్కరించడం, ఉన్నత న్యాయ వ్యవస్థ పనితీరులో కనీవినీ ఎరుగనంతటి పారదర్శకత తీసుకురావడం, ప్రాజెక్ట్ ల నిర్మాణంలో పర్యావరణ క్లియరెన్స్ లను వేగిరపరచడం వంటి అనేక వినూత్నమైన ఆలోచనలను మన్మోహన్ సింగ్ సహచరులు దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు.
అయితే ఈ ఆలోచనలు, ప్రణాళికలలో అంతుబట్టని, సమాధానం తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వీటిపై సమాజంలోని అన్ని వర్గాలలో క్షుణ్ణంగా చర్చ జరగకుండా 100 రోజుల డెడ్ లైన్ అంటూ ఆచరణలోకి తీసుకువస్తే అది అటు ప్రభుత్వానికి, ఇటు దేశానికి కూడా చేటు తీసుకురాగలవని విధాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. 100 రోజుల ప్రణాళికలను ఆవిష్కరించడంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్, న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి పోటీ పడి మరీ ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేష్ కూడా మొదట్లో ఈ రేసులో చేరినా తర్వాత పక్కకు తప్పుకుని తమ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రతిపాదనలు 100 రోజుల డెడ్ లైన్ తో చేస్తున్నవి కాదని వివరణ ఇచ్చుకున్నారు.
'నిజమే. కేంద్ర మంత్రులు కొందరు ప్రకటించిన ప్రతిపాదనలలో కొన్ని విప్లవాత్మకమైనవి. మరికొన్ని ఆసక్తికరమైనవి. అయితే వాటిలో కొన్ని సవివరంగా లేవు. అలాంటి వాటిని 100 రోజుల లక్ష్యంగా పెట్టుకుని అమలు చేయడానికి ప్రయత్నించ కూడదు. ప్రభుత్వం దీనికి తగినంత సమయం తీసుకుని ముందుకెళ్ళాలి' అన్నారు ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి సంస్థ అధ్యక్షుడు ప్రతాప్ భాను మెహతా.
Pages: 1 -2- News Posted: 2 July, 2009
|