రహదారులకు మహర్దశ
న్యూఢిల్లీ : అన్నిరంగాలలనూ ఆర్ధికంగా చైతన్యవంతం చేయడంలో, వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో రహదారులు దోహదపడతాయని, దేశ ఆర్ధిక ప్రగతిలో రహదారులు కీలకమైన భూమికను పోషిస్తాయని, అందుకే రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి కమల్ నాథ్ వెల్లడించారు. ఇక నుంచి రోజుకు 20 కిలోమీటర్ల రహదారులను ప్రతీ రోజు నిర్మించాలన్నది తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. యూపియే ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళలో రోజుకు కేవలం రెండు కిలోమీటర్ల రహదారులను మాత్రమే వేసింది. కమల్ నాథ్ ప్రకటించిన లక్ష్యం దానికంటే పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రైలు రవాణా మీదే దేశ ఆర్ధిక అభివృద్ధి ఆధారపడుతుందని మమతా బెనర్జీ భావిస్తుంటే అదే కోణంలో రహదారులను కమల్ నాథ్ చూస్తున్నారు.
రహదాలు అభివృద్ధి, నిర్మాణం ఏదో తాపీగా జరిగే పనిగా చూడటం లేదని, మనం తలుచుకుంటే ఒక్క కుదుపుతో వాటిని అభివృద్ధి చేయగలమని కమల్ నాథ్ చెప్పారు. దేశంలో వాహనాల సంఖ్య ఏటా పదమూడు శాతం పెరుగుతోందని, కాని జాతీయ రహదారుల అభివృద్ధి మాత్రం రెండు శాతంగా ఉందని ఆయన అన్నారు. ఈ దారులే 40 శాతం ట్రాఫిక్ ను భరిస్తున్నాయని, ఇది సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున సంవత్సరానికి ఏడు వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మంచాలన్నది తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. యూరప్ దేశాలు, అమెరిగా సంయుక్త రాష్ట్రాలు గణనీయంగా అర్ధిక ప్రగతి సాధించడానికి రహదారులే ప్రధాన కారణమని ఆయన వివరించారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పాశ్చత్య దేశాలు ఆర్ధికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారతదేశం ఆర్ధిక పరిస్థితిని స్ధిరీకరించుకోడానికి వ్యూహలు రచించుకోవాలని, దీనిలో భాగంగా సహజ వనరులను అందుబాటులోకి తెచ్చే మౌలిక వసతుల పైన, రహదారి వసతులపైన దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 4 July, 2009
|