కేసీఆర్ కసరత్తు
హైదరాబాద్ : తెరాసకు అసమ్మతి బెడద తప్పిపోయిందని మీడియాలో ప్రకటనలు చేసిన కేసీఆర్ ఇంకా మిగిలిపోయిన అసమ్మతి నేతలపై మానసిక యుద్ధాన్ని ప్రారంభించారు. బయటకు పోయినా తన పిలుపుతో లోనికి వచ్చినవారు రాగా, ఇంకా బయట మిగిలిపోయిన అసమ్మతి నాయకులు నామమాత్రులేనని, తెరాస వల్లే నాయకులుగా పేరు తెచ్చుకున్నారని పార్టీ లేకపోతే వీళ్ళు అనామకులుగా మిగిలిపోతారని ఆయన ప్రచారం మొదలు పెట్టారు. అలానే తెరాసలోని విభేదాలకు ప్రాధాన్యం ఇస్తున్న మీడియాను కూడా కేసీఆర్ ఈ మధ్య కాలంలో దూరంగా ఉంచుతున్నారు. బయట మిగిలిపోయిన అసమ్మతి నాయకులను వంటరివారిని చేయడానికి ఆయా జిల్లాల ముఖ్యనాయకులతో మంతనాలు జరుపుతున్నారు.
ఎన్నికల ఫలితాలపై వెల్లడి అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏర్పడ్డ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు అసమ్మతిని కూడా బలహీనం చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. జిల్లాలో విస్తృతంగా పర్యటించి స్థానిక నాయకుల మధ్య ఉన్న విభేదాలను, భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీనంగర్ నుంచే కెసిఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. శనివారమే కరీంనగర్ చేరుకున్న కెసిఆర్ ఆదివారం మేధావులతో, తెరాస నాయకులతో ముమ్మర చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలి? ప్రజా సమస్యలపై ఏరకమైన ఉద్యమాలు చేయాలి? అనే అంశాలపై కేసీఆర్ వారితో విస్తృతంగా చర్చిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 6 July, 2009
|