బాబు టార్గెట్ జెపీ
(వరప్రసాద్ గాలిదేవర)
హైదరాదాబాద్ : పరుగు పందెంలో నెగ్గాలంటే మనమే పరుగెత్తక్కర్లేదు. పక్కనే పోటీగా పరుగెడుతున్న వాళ్ళ కాళ్ళు విరగొట్టేస్తే మనం గెలిచేసినట్టే... తొమ్మిదేళ్ళు అధికార పరిష్వంగంలో హాయిగా గడిపేసిన చంద్రబాబు ఐదేళ్ళ విరహం తర్వాత కూడా విజయలక్ష్మి వరించకపోవడంతో దారుణంగా దెబ్బతిన్నారు. ఓటరు మహాశయులు తమను కరుణించకపోవడానికి ఈసారి ఎన్నికల స్వయంవరంలోకి కొత్త వీరులు రావడమేనని ఆయన సిద్ధాంతీకరించారు. 2014లోనైనా అధికార కాంత వరించాలంటే ఎక్కువ మంది పోటీదారులు ఉండరాదని, స్వయంవరం లోగానే వారిని అంతమొందించాలని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్ర అత్యున్నత అధికార పీఠం వాకిలి దాకా వచ్చి బొక్కబోర్లా పడడాన్ని ఓట్లు చీలిపోవడమే అసలు కారణమని, కాంగ్రేసేతర ఓట్లన్నీ తెలుగుదేశానికే పడాలంటే ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం, లోక్ సత్తాల ఉనికే ఉండరాదనేది ఆయన నిశ్చయం. ఎన్నికలకు ముందు అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ పై ప్రచార దాడి జరిపిన చంద్రబాబు ఎన్నికల తరువాత ఆ దాడిని ఈ రెండు పార్టీలవైపు మళ్ళించారు. కాంగ్రెస్ పై చేసిన అవినీతి ఆరోపణలు సరైన ఫలితాలను ఇవ్వకపోవడం తర్వాత విషయం. ముడుపులకు అతీతులు కాని రాజకీయ నాయకులు లేరనే ప్రగాఢ విశ్వాసంతో ఇప్పుడు లోక్ సత్తా, ప్రజారాజ్యంపై అవే ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు తనకు ఎసరుపెట్టే భూతాన్ని ప్రజారాజ్యం పార్టీలో చూశారు. మెగాస్టార్ ఇమేజ్ తో జనంలో పాపులారిటీ ఉన్న చిరంజీవి తనకు సైంధవునిలా మారతారని భయపడ్డారు. ఎన్నికలకు ముందే పార్టీని నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగంగా కోవర్టలను ప్రజారాజ్యంలోకి పంపించారు. ఇస్తే టిక్కెట్ తీసుకుని గెలిచి తిరిగివొచ్చేయి, టిక్కెట్ ఇవ్వకపోతే బయటకు వచ్చి అమ్ముకుంటున్నారని అల్లరి చేయాలని ముందే ఈ కోవర్టలకు పాఠాలు చెప్పి మరీ పంపించారు. దానికి తోడు గ్లామర్ ను గ్లామర్ తోటే ఎదుర్కోవాలని బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచార రంగంలోకి దింపారు. నటి రోజాను కూడా చిరంజీవి సోదరుల మీదకు ఉసిగొలిపారు. ప్రజారాజ్యం పార్టీలో అంతర్గతంగా లోపభూయిష్టమైన వ్యవస్థ ఏర్పడడంతో చంద్రబాబు వ్యూహం సులువుగానే పారింది. ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పుణ్యమా అని కోవర్టులు అనుకున్నదానికంటే బలంగానే ఆ పార్టీని దెబ్బతీయగలిగారు. ఇప్పుడు ఆ పార్టీ పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలిచినా వారిలో ఎక్కువ మంది తెలుగుదేశం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఇప్పటికీ చంద్రబాబునాయుడుకు అదే ధీమా. తాను తలచుకుంటే వారిని తిరిగి రప్పించుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. అయినా ఇప్పటికే ఆ పనిని కొంతమంది సీనియర్లకు ఆయన అప్పగించారు.
తాజాగా చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం పార్టీపై చేస్తున్న ఆరోపణలేవీ ఆంధ్ర ప్రజలకు కొత్తవి కావు. ధనవంతులకు ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లు అమ్ముకుందన్న ప్రచారం ఎన్నికలకు ముందు నుంచి వినీ వినీ ప్రజలు విసిగిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజారాజ్యంలో ఏర్పడిన పరిణామాలు కూడా ఈ ఆరోపణలు నిజమేనేమో అన్న అభిప్రాయాన్ని కలిగించేవిగానే ఉన్నాయి. టిక్కెట్లను అమ్ముకున్నారన్న అల్లు అరవింద్ ను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వెనకేసుకొచ్చారు. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నిజాయితీ పరుడుగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణలపై ఏనాడూ పెదవి విప్పలేదు. పైగా దారుణమైన పరాజయాన్ని పరాభవాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా అరవింద్ ను తప్పించకపోవడానికి నిరసనగా ఆయనే ప్రజారాజ్యం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించారు. ఆయనతో పాటు సోదరుడు నాగబాబు కూడా పార్టీకి దూరమయ్యారు. కాబట్టి ఈ పార్టీపై చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించే, విస్మయానికి గురిచేసే ప్రత్యేకమైన ఆరోపణలు చేయడానికి ఏమీ మిగలలేదు.
Pages: 1 -2- News Posted: 8 July, 2009
|