శ్రీవారి డాలర్ల దొంగలెవరు?
హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికే శఠగోపం పెట్టిన ప్రబుద్ధులపై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన స్వామివారి డాలర్ల అదృశ్యం కేసు ఇంకా సాగుతూనే ఉంది. పైగా ఈ వ్యవహారంలో సంజాయిషీ ఇవ్వాలని మంగళవారం తాజా ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వం మళ్ళీ డాలర్ కేసును తెరపైకి తెచ్చింది. శ్రీవారి సన్నిధిలో సేవకులుగా ఉన్నవారే బంగారు డాలర్లను స్వామివారి సాక్షిగా కైంకర్యం చేశారని రుజువైంది. శ్రీవారి బొక్కసానికి కాపుకాయాల్సిన శ్రీవారి సేవకులే ఏకంగా 300 బంగారు డాలర్ల అపహరణ కేసుకు బాధ్యులయ్యారు. ఇందులో ఇప్పటికే 8 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా ప్రధాన డాలర్ల పరాపతేదార్ డాలరు శేషాద్రి మాత్రం తిరిగి శ్రీవారి కొలువులో ప్రధాన భూమిక పోషించే `ఓఎస్ డి' పదవిలో కొనసాగడం గమనార్హం.
2006లో వెలుగుచూసిన ఈ సంఘటనలో టిటిడి ఉద్యోగులైన అప్పటి పేష్కార్ ఆర్.ప్రభాకర్ రెడ్డి (రిటైర్డ్), కె.వెంకటాచలపతి (టిటిడి అదనపు షరాఫ్ తో పాటు గోల్డ్ డాలర్లు అమ్మకం కౌంటర్ అధికారి), ఎం.చంద్రశేఖర్ రెడ్డి (రిటైర్డ్), ఎం.వి.రమణమూర్తి (రిటైర్డ్), ఎ.రఘురామిరెడ్డి (రిటైర్డ్), రామచంద్రారెడ్డి (పేష్కార్, సూపరింటెండెంట్), పి.శేషాద్రి (రిటైర్డ్) అప్పటి పరాపతేదార్, శ్రీవారి బొక్కసం ఇంచార్జ్ కూడా అయిన ఇతను ప్రస్తుతం టిటిడి ఓఎస్ డిగా ఇంకా కొనసాగుతున్నారు. ఎ.వాసుదేవన్ (పేష్కార్), ఆర్.రంగనాధాచారి (రిటైర్డ్), కె.చిత్తరంజన్ (రిటైర్డ్), యం.వెంగన్న(రిటైర్డ్), పి.ఆంజనేయులు (సీనియర్ అసిస్టెంట్), ఎన్.చెంచులక్ష్మి (రిటైర్డ్), కె.గోవర్థన్ (సూపరింటెండెంట్), శ్రీరామ్ (సీనియర్ అసిస్టెంట్)లను డాలర్లు మాయం కేసులో బాధ్యులుగా గుర్తించారు. అప్పట్లో డాలర్లు మాయం కుంభకోణానికి సంబంధించి అప్పటి షరాబును అరెస్ట్ కూడా చేశారు. ఇతనితో పాటు శేషాద్రి, రామచంద్రారెడ్డి, వాసుదేవన్ చంద్రశేఖర్ రెడ్డిలను విధుల నుండి బహిష్కరించారు. అయితే డాలర్ల భాగోతానికి సంబంధించి సంజాయిషీ అడిగే హక్కు దేవస్థానం ఇవోకు లేదని కేవలం ప్రభుత్వ కార్యదర్శికే అధికారముందని వాదించి మళ్ళీ ఈ నలుగురు విధుల్లో చేరడం వీరి పలుకుబడికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
Pages: 1 -2- News Posted: 8 July, 2009
|