మావోలపై ఉక్కుపాదం
హైదరాబాద్: దేశంలోని అనేక ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్న మావోయిస్టులను కట్టడి చేయడానికి కేంద్రం వ్యూహాన్ని రచిస్తోంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలను తీవ్రవాద చర్యలుగానే పరిగణించాలని, వారిపై ముప్పేట దాడులు చేయడం ద్వారా పూర్తిగా అణచివేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే వందరోజుల ప్రణాళికను సిద్దం చేసింది. అలానే ఆగస్టు నెలలో మావోయిస్టు పీడిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశం అంశాలను కేంద్రం రహస్యంగానే ఉంచబోతోంది. అదే సమయంలో మావోయిస్టులతో చర్చలు జరపడానికి రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంటులో సూచించారు.
అయితే నక్సలైట్లతో కేంద్రం నేరుగా చర్చలు జరుపుతోందని, నక్సల్స్ బాధిత రాష్ట్రాలు వారితో చర్చలు జరిపితే జరుపుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ఒకవేళ చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఆంధ్రా అనుభవం ఒకవైపు కంటికి కనబడుతుండగా, మావోయిస్టులు చర్చలకు ఎలా వస్తారని పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఇక పార్లమెంటు సమావేశాల తర్వాత దండకారణ్యం తదితర ప్రాంతాలపై ముప్పేట దాడికి కేంద్ర పారామిలిటరీ బలగాలు సిద్ధమవుతున్నాయి అని చెప్పారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా నక్సలైట్లతో 2004 అక్టోబర్ నెలలో చర్చలు జరిపింది. ఇవి నక్సలైట్ల ఆచూకీని సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత జరిగిన వరస సంఘటనల్లో ఆంధ్ర మావోయిస్టు ఉద్యమ నాయకుల్లో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది దళ సభ్యులు ఎన్ కౌంటర్లలో మరణించారు.
Pages: 1 -2- News Posted: 9 July, 2009
|