చల్లారని ఎన్నికల సెగ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సెగలు చల్లారలేదు. సార్వత్రిక ఎన్నికలు ముగిసీ ముగియగానే మళ్ళీ కుంపటి రాజుకుంది. అరకొర ఆధిక్యంతో అధికారం చేపట్టినా వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి కంగుతిన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి `స్థానిక' జపం ప్రారంభించారు. కనీసం యాభై ఒక్క శాతం ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, తన ప్రభుత్వానికి తిరుగులేకుండా చేసుకోవడం లక్ష్యంగా ఆయన నిర్ణయించుకున్నారు. దీనిని సాధించడానికి స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా నిర్ధారించుకున్నారు. అన్ని స్థాయిలలోనూ పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి సన్నద్ధం చేయడం మొదలుపెట్టారు. అలానే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా శరవేగంతో ప్రజలకు అందేటట్లు అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. దాంతో మిగతా అన్ని రాజకీయ పక్షాలూ కొంచెం సేపైనా ఊపిరి తీసుకోకుండా మళ్లీ ఎన్నికల తతంగంలో మునిగిపోయారు.
మొన్నటి ఎన్నికల్లో మహాకూటమి, ప్రజాకూటమి, మెగాకూటమి అంటూ జతలు కట్టిన పార్టీలు ఈ సారి పొత్తుల ప్రస్తావనల జోలికి పోవడం లేదు. ఈ పరిణామం వలన స్థానిక ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోసారి అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి వైఎస్ తనదైన శైలిలో స్థానిక ఎన్నికలకు తెరదీశారు. గడువుకు ముందే వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల నిరుత్సాహాన్ని ప్రక్కన పెట్టి పరుగు మొదలెట్టాయి. లోక్ సత్తా, బిజెపి, వామపక్షాలు ఓటమి నుంచి తమ శ్రేణులను తిరిగి కార్యోన్ముఖులను చేస్తున్నాయి. ప్రజల్లో తమ పట్ల ఆదరణ ఉందని, దాన్నిఓట్ల రూపంలో మలచుకోలేకపోయామని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఈ లోటను పూడ్చుకుంటామని ధైర్యం చెబుతున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశంల మధ్యే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pages: 1 -2- News Posted: 10 July, 2009
|