తగ్గని ఇంజనీరింగ్ క్రేజ్
హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం, ఐటి రంగం కుప్పకూలిపోవడంతో ఈసారి ఇంజనీరింగ్ విద్యకు క్రేజ్ తగ్గుతుందని భావించారు. అయితే, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈసారి ఇంజనీరింగ్ విద్యకు మరింత క్రేజ్ వచ్చింది. పైగా మేనేజ్ మెంట్ కోటా సీట్ల ధరలు గతంలో కన్నా ఇప్పుడు బాగా పెరిగాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలంటే విద్యార్థులకు మంచి క్రేజ్ ఉంది. జెఎన్ టియు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలను మినహాయిస్తే టాప్ టెన్ గా నిలిచిన కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. వీటిలో మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం బేరసారాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసంఈ నెల 28 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో 25 శాతం సీట్లు మేనేజ్ మెంట్ కోటా కింద యాజమాన్యాలు భర్తీ చేస్తాయి. మిగిలిన 75 శాతం సీట్లను కన్వీనర్ భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సీట్లను పూర్తిగా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. మేనేజ్ మెంట్ కోటాను సైతం నిబంధనలకు అనుగుణంగా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంది. కన్వీనర్ కోటాలో అవకతవకలకు అవకాశం లేదు. అయితే యాజమాన్య కోటాలో నిబంధనలేమీ పాటించడం లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. వేలం వేసినట్టుగా చాలా కాలేజీలు మేనేజ్ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. గండిపేటలోని ఒక ప్రముఖ కాలేజీలో మేనేజ్ మెంట్ కోటాలో ఇసిఇ సీటు ధర పది లక్షల రూపాయల వరకు పలుకుతోందని సమాచారం. కన్వీనర్ కోటా కింద ఫీజు 30,600 రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా, మేనేజ్ మెంట్ కోటా కింద దీనికి మూడింతలు చెల్లించాలి.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మేనేజ్ మెంట్ కోటా ఫీజు 91 వేల రూపాయలు ఉండగా అందుకు భిన్నంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఊరూ పేరూ లేని కాలేజీలు సైతం రెండు మూడు లక్షలు డొనేషన్లుగా వసూలు చేస్తున్నాయి. మేనేజ్ మెంట్ కోటా సీట్లను మెరిట్ పైనే భర్తీ చేయాల్సి ఉండగా నారాయణగూడలోని ఓ కాలేజీలో గతంలో ఈ కోటా ఇబ్బందిగా భర్తీ అయితే ఈ సారి మాత్రం ఫీజు కన్నా అధికంగా చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. నగరంలోను నగర శివార్లలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా కింద సీట్లు కేటాయించినట్లు ఎలాంటి రసీదులు ఇవ్వకపోయినా కొంత మొత్తం అడ్వాన్స్ గా తీసుకుని సీటు గ్యారంటీ మాట ఇస్తున్నారని సమాచారం.
Pages: 1 -2- News Posted: 11 July, 2009
|