పాపం... చిరు!
హైదరాబాద్ : 'ఎవరికి ఎవరు... చివరికి ఎవరు?' అన్న చందంగా మారింది ప్రజారాజ్యం పరిస్థితి... దాని అధినేత కొణిదెల చిరంజీవి స్థితి. పార్టీ నుంచి బయటికి పోయేవారు పోతుండగా, ఉన్న కొందరూ తమ సొంత వ్యాపారాలు, వృత్తుల్లో నిమగ్నమై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చిరు నిర్మించుకున్న రాజ్యం కోటలో చివరికి ఆయన ఒక్కరే మిగిలేలా కనిపిస్తోందన్న వ్యాఖ్యాలు వినవస్తున్నాయి.
`ప్రజలకు మంచి చేస్తున్నంత వరకు మీరు ఎల్లకాలం అక్కడే కూర్చోండి, అందుకు మా వంతు సహకారం ఉంటుంది, లేని పక్షంలో మాలో (ప్రతిపక్షా పార్టీలు) ఒకరు మీ స్థానంలోకి వచ్చి కూర్చునే పరిస్థితి వస్తుంది' అని చిరంజీవి శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీ నేతలు వేరేగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోనో, అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపిలోనో చేరడం మంచిదని ప్రజారాజ్యంపార్టీ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చే దాకా ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడం దేవుడెరుగు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల వరకైనా పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఆ పార్టీలో నెలకొన్నది.
పార్టీ యంత్రాంగం కింది స్థాయి నుంచి పటిష్టంగా లేకపోవడమే ఎన్నికల్లో ఓటమికి కారణమని ఫలితాలు విశ్లేషించుకున్న ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. పార్టీ పటిష్టత కోసం జిల్లాలకు వెళ్లిన పార్టీ పరిశీలకులు కొందరు అటు నుంచి అటే వలస బాట పట్టడంతో అధినేత చిరంజీవిని నిద్రకు దూరం చేస్తోంది. పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టం చేయడానికి తన వంతుగా అధినేత చిరంజీవి ఈ నెల 6 నుంచే జిల్లా పర్యటనలకు వెళ్ళాల్సి ఉంది. పార్టీ నుంచి సీనియర్లంతా ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమిస్తూ, షాక్ ల మీద షాకులు ఇస్తుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్నికల తర్వాత చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కూడా ఇటీవల పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. దీనికి తోడు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ మిత్రా పార్టీకి రాజీనామా చేశారు. మిత్రా లేకపోతే పార్టీయే ఉండదని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యేటట్టుగా ఇటీవల ఒకరి తర్వాత ఒకరుగా క్యూ కట్టి పార్టీని వదిలిపెడుతుండడంతో ప్రజారాజ్యం పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 11 July, 2009
|