నక్సలిజం పెను సవాలే
న్యూఢిల్లీ : దేశంలో నక్సలైట్ల సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం అంగీకరించారు. బుధవారం రాజ్యసభలో ప్రసంగించిన ఆయన నక్సలైట్ల సమస్య తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ రోజు నక్సలిజం దేశానికి పెను సవాలుగా మారిందన్నారు. అయితే అందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు వెల్లడించలేమన్నారు. గత కొన్నేళ్ళుగా వామపక్ష తీవ్రవాదం ముప్పును సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యామని చిదంబరం అన్నారు. నక్సలైట్ల ప్రభావాన్ని తక్కువగా అంచనావేశామనీ, అదే సయమంలో వారు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నారని ఆయన చెప్పారు.
మావోయిస్టులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఒక మిలటరీ సలహాదారును నియమించినట్లు చిదంబరం తెలిపారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలతో కలిసి ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో కూలంకుషంగా చర్చించి ఈ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అంతే కాకుండా ఇందుకోసం ఒక మిలటరీ సలహాదారును కూడా నియమించినట్లు తెలిపారు. అలాగే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను సంప్రదింపులు జరుపుతున్నాననీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆగస్టులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నక్సల్స్ సమస్యను ఎదుర్కొనే విషయంలో అవలంభించాల్సిన విధానాలను చర్చించనున్నట్లు తెలిపారు. వాటిని కేంద్ర ప్రణాళికతో అనుసంధానం చేయడం ద్వారా సత్ఫలితాలను రాబట్టవచ్చునని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా నక్సలిజం దేశానికి పెను సవాలుగా మారిందని చెప్పిన సంగతి విదితమే.
Pages: 1 -2- News Posted: 16 July, 2009
|