ఆసక్తి చూపని నేతలు
హైదరాబాద్ : పోలీసు సంస్కరణలను అమలు చేసేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తిని చూపడం లేదని సుప్రీం కోర్టు నియమించిన మానిటరింగ్ కమిటీ చైర్మన్, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కెటి థామస్ అన్నారు. సుప్రీం కోర్టు వివిధ రాష్ట్రాల్లో పోలీసు సంస్కరణల అమలు తీరును పరిశీలించి ఒక నివేదికను సమర్పించేందుకు జస్టిస్ కెటి థామస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో జాతీయ పోలీసు అకాడమి మాజీ డైరెక్టర్ కమల్ కుమార్, హోంశాఖ సంయుక్త కార్యదర్శి ధర్మేంద్ర శర్మ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పోలీసు సంస్కరణల అమలు తీరును పరిశీలించేందుకు హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా కమిటీ అధిపతి జస్టిస్ కెటి థామస్ మాట్లాడుతూ తమ కమిటీని 2008 మే 16వ తేదీన సుప్రీం కోర్టు నియమించిందన్నారు.
ప్రతి ఆరు నెలలకు నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉందన్నారు. తమ పనిని ఆంధ్రా నుంచే ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో పోలీసు సంస్కరణల అమలు తీరుపై ఒక సమగ్ర నివేదికను ఈ ఏడాది సెప్టెంబర్ లోగా సుప్రీం కోర్టుకు సమర్పించనున్నట్లు చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో పర్యటించి పోలీసు సంస్కరణల అమలు తీరుపై ప్రతి ఆరునెలలకోసారి నివేదికను సమర్పిస్తామన్నారు. దేశంలో ఇంత వరకు రాజస్థాన్, అస్సాం, సిక్కిం, బీహార్, చత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, త్రిపుర, ఉత్తరాంఖండ్ రాష్ట్రాలు పోలీసు సంస్కరణలకు అనుకూలంగా బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదించి చట్టాలను రూపొందించాయన్నారు.
Pages: 1 -2- News Posted: 18 July, 2009
|