వరదలే దిక్కు
హైదరాబాద్ : గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల వరదనీరు మాత్రమే మన వినియోగానికి అందుబాటులో ఉంటుందన్న వైరాగ్యానికి ఈ రాష్ట్ర రైతులు సిద్దపడిపోయారు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోగా మిగిలిన అదనపు నీరు, వరదనీరే మన రాష్ట్రానికి గతవుతోంది. ఏ ప్రభుత్వం కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో అక్రమ ఆనక్టల నిర్మాణాన్ని అడ్డుకోలేకపోతోంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయపార్టీల నేతలు అఖిలపక్ష బృందాలుగా ఏర్పడి చేస్తున్న పర్యటనలు, కోర్టుల్లో నడుపుతున్న వ్యాజ్యాలు సాధారణ రైతులపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. వీరి పర్యటనలకు మీడియాలో మంచి ప్రచారం లభిస్తున్నా సాధారణ రైతులు, ప్రజలు వాటిపట్ల ఆసక్తి చూపడం లేదు.
రాష్ట్రంలో గత పదేళ్ళుగా జలఘోష సాగుతోంది. ఎగువ రాష్ట్రాల అక్రమ నీటి వినియోగాన్ని నిరోధించలేమని తెలిసినప్పటికీ అన్ని పార్టీలు నీటి రాజకీయాలకు పాల్పడుతున్నాయి. పైగా ఈ వైఫల్యానికి బాధ్యులు మీరంటే మీరని ఒక పార్టీపై మరోపార్టీ దుమ్మెత్తిపోస్తున్నాయి. సకాలంలో చర్యలు తీసుకొనకపోవడం వల్లే అక్రమ డ్యామ్ ల నిర్మాణం సాగిందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించిందంటూ అన్ని పక్షాలు విమర్శలకు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చట్టాలు, న్యాయస్థానాల హక్కులు, పరిధులు తెలియని సాధారణ అమాయక ప్రజల్లో పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రాల పరిధిలో చేపట్టిన నిర్మాణాలను నిలిపేసే అధికారం కేంద్రానికి ఉందా అన్న కొత్త సందిగ్ధం చోటుచేసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సాలు తమ ప్రయోజనాల కోసం ఆనకట్టలు కడుతున్నాయి. వీటి లబ్ధిదారులు కూడా భారతీయులే. ఆ రాష్ట్రాల ప్రజలకూ దేశ సంపదపై హక్కుంది. దీన్ని కేంద్రప్రభుత్వం, న్యాయస్థానాలు కాదనలేవు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే అఖిలపక్ష బృందాల ఢిల్లీ యాత్రలు సాగుతున్నాయన్న విశ్వాసం ప్రజల్లో వ్యక్తమౌతోంది. ఈ యాత్రలకు విపరీత ప్రచారం లభిస్తోంది. ఈ ప్రచారం కేవలం పదిశాతం మంది పాఠకుల విశ్వాసాన్ని మాత్రమే పొందగలుగుతోందని ఓ సర్వేలో తేలింది.
Pages: 1 -2- News Posted: 20 July, 2009
|