మనదే అణుజలాంతర్గామి
విశాఖపట్నం : అమెరిగా తయారు చేసిన మొట్టమొదటి అణు జలాంతర్గామి యుఎస్ఎస్ నాటిలస్ జల ప్రవేశం చేసి ఐదున్నర దశాబ్ధాలు గడిచాయి. సముద్రగర్భంలో ప్రయాణించగల అన్ని వాహనాల వేగాలను, లోతులను ఆది అమోఘంగా అధిగమించింది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు మన భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి కలను సాకారం చేసుకోబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ జలాంతర్గామి ప్రాధమిక పరీక్షల కోసం సాగర జలాల్లోకి దూసుకుపోబోతున్నది. భారత రక్షణ శాఖ అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ జలాంతర్గామికి ఐఎన్ఎస్ అరిహాంత్ (శత్రు సంహారిణి) అని పేరు పెట్టారు.
ప్రపంచానికి తెలియకుండా ఈ జలాంతర్గామి నిర్మాణం అంతా ఎటివి అనే సంకేత నామంతోనే ఇంతకాలం సాగింది. ఎడ్వాన్సుడు టెక్నాలజీ వెసల్(ఎటివి) ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్న ఈ అణు జలాంతర్గామి నిర్మాణం అంతా విశాఖలోని నేవల్ డాక్ యార్డులోనే జరిగింది. అంతా సజావుగా సాగితే జూలై 26 వ తేదీన దీనిని జలప్రవేశం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్ హజరవుతున్నారు. ఆయన సతీమణి గుర్షరణ్ కౌర్ చేతుల మీదుగా ఈ జలాంతర్గామి తన సామర్ధ్యాన్ని పరీక్షించుకోడానికి బంగాళాఖాతంలోకి ఉరకబోతోంది.
ప్రపంచంలో అణుజలాంతర్గామికి రూపకల్పన చేసి, నిర్మించి, నడపగల సామర్ధ్యం ఇప్పటివరకూ కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు వాటి సరసన భారత్ సగర్వంగా నిలబడబోతోంది. అతి క్లిష్టమైన మీనియేచర్ 80 మెగావాట్ల ప్రెస్సరైజ్ డ్ వాటర్ రియార్టర్ ద్వారా ఈ ఎటివి పనిచేస్తుంది. 2012 నుంచి అయిదు సంవత్సరాల్లో మరో రెండు అణుజలాంతర్గాములను భారత్ నిర్మిస్తుంది. ఆరువేల టన్నుల బరువైన ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ పరీక్షలు పూర్తి చేసుకుని సంపూర్ణంగా రక్షణ విభాగం అమ్ములపొదిలో చేరడానికి మరో రెండు సంవత్సారాలు పడుతుంది.
Pages: 1 -2- News Posted: 20 July, 2009
|