జలాశయాలు కళకళ
హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలోకి వరద నీరు చేరుకోవడంతో ఆ డ్యాంకు సంబంధించిన 11 గేట్లను అక్కడి అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఎత్తివేసినట్లు సమాచారం. దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ ప్రాజెక్టులోకి 35వేల క్యూసెక్కుల వరద నీరు రానుంది. నారాయణపూర్ డ్యాంలో ప్రస్తుతం 482.169 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. వరద నీరు ఇప్పటికే 5517 మీటర్ల స్థాయిలో నారాయణపూర్ డ్యాంలోకి చేరింది. దీంతో నారాయణపూర్ డ్యాం దిగువన ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో గల జూరాల ప్రాజెక్టులోకి రెండు, ముడు రోజుల్లో వరద నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఆల్మట్టి డ్యాం నుండి వస్తున్న 35వేల క్యూసెక్కుల వరద నీరు ఇలాగే మరో రెండురోజులు కొనసాగితే జిల్లాలోని జూరాలతో పాటుకర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చేఅవకాశం ఉంది. ఈప్రాంత రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఇక్కడి రైతులకు ఊరటను గలిగించనున్నాయి.
శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 885 అడుగులకు గాను 799 అడుగులు ఉండగా ఈ లెవల్ లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలు కానందున దిగువన నాగార్జునసాగర్ రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. డ్యామ్ కుడి భాగానగల రెండు మూడు రివర్ స్లూయిస్ గేట్లను ఒక్కొక్కటి పది అడుగుల చొప్పున ఎత్తి 12800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 21 July, 2009
|