కసబ్ ఎత్తు వేశాడా?
ముంబయి : ముంబయిపై దాడి చేసి పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ సోమవారం నేరాన్ని అంగీకరించడం ఈకేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును అణుబాంబుమాదిరి తాకింది. విచారణ సమయంలో తాను నేరం చేయలేదని ఒకసారి, తాను మైనర్ ని కాబట్టి శిక్షవేయరాదని మరోసారి ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టును గందరగోళానికి గురి చేసిన కసబ్ ఎవరి ఊహకూ అందని రీతిలో సోమవారం తాను నేరస్థుడినని అంగీకరించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత నాటకీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామం కోర్టులో లాయర్లను దిగ్ర్భాంతికి గురి చేసింది.
అయితే, కసబ్ హఠాత్తుగా నేరాన్ని అంగీకరించడం పట్ల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కసబ్ స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేక అతనికి ఎక్కడి నుంచైనా ఆదేశాలు అందాయా? లేక అతని వ్యూహాత్మక ఎత్తుడగలో ఇదొక భాగమా? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. జాతీయ భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు ఎన్నో అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఈ కేసులో కసబ్ అనూహ్యంగా మాటమార్చడం, నేరాన్ని అంగీకరించడం ఆశ్చర్యకరంగా ఉందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే 134 మంది ప్రత్యక్ష సాక్షులు తనను గుర్తించిన నేపథ్యంలో గత్యంతరం లేక అతను ఈ నిర్ణయ తీసుకొని ఉంటాడని అభిప్రాయపడ్డారు.
ముంబయిపై దాడులకు పాల్పడిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26 నుంచి 28 వరకు ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి, దేశాన్నేగాక, యావత్ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేశారు. అయితే, ఉగ్రవాదులు దాడులను ఆరంభించిన కొన్ని గంటల్లోనే గిర్ గావ్ వద్ద కసబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆర్థడ్ రోడ్డు జైలులో ఉంచారు. అక్కడే ఈ కేసును విచారించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉజ్వల్ నికమ్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గత ఏడాది డిసెంబర్ లో నియమించింది. కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక కోర్డుకు ఎంఎల్ తహిల్యానీని న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వారంలో పోలీసులు 11,000 పేజీలతో కూడిన చార్జిషీట్ ను దాఖలు చేశారు. తన తరఫున వాదించడానికి లాయర్ ను నియమించాలని కసబ్ చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చి చివరిలో అంజలీ వాగ్మారేను లాయర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Pages: 1 -2- News Posted: 21 July, 2009
|