ఇవిఎంపై కాంగ్రెస్ ప్రేమ
హైదరాబాద్ : ఇవిఎంల పనితీరును వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ వ్యవహారశైలి సందేహాలకు తావిస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించడం, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం సర్వసాధారణం. అయితే ఎన్నికల నిర్వహణతో సంబంధం లేని కాంగ్రెస్ ఈ విషయంలో తలదూర్చి ప్రకటనలకు దిగడం విమర్శల పాలవుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇవిఎంల పనితీరు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. తమిళనాడు, హర్యానా, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇవిఎంల పనితీరును వివిధ రాజకీయ పక్షాలు తప్పు బట్టాయి. ఇవిఎంల పనితీరులో ఇతరులు జోక్యం చేసుకోవచ్చని, మోసానికి ఆస్కారం ఉందంటూ జన చైతన్య వేదిక ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిరూపించింది. దీంతో ఇవిఎంల విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. ఇవిఎం లను ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల కమిషన్ పై ప్రజల సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. తద్వారా తన విశ్వసనీయతను ఎన్నికల కమిషన్ నిరూపించుకోవాల్సి ఉంది.
దేశంలో సర్వసత్తాక స్వతంత్ర కమిషన్ గా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ తన ఎన్నికల నిర్వహణాతీరుతో పాటు ఫలితాల వెల్లడి కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఉన్నాయంటూ నిరూపించుకోని పక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలే కదిలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కంటే కాంగ్రెస్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ నేతలు ఇవిఎంల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పనితీరును సందేహించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. విమర్శించిన పార్టీలపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అసలు కాంగ్రెస్ విశ్వసనీయతపైనే సందేహాలు కల్పిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప ఒంటికాలితో పైకిలేచినంత మాత్రానా ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలిగిపోవని, విశ్వసనీయత పెరగదన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది.
Pages: 1 -2- News Posted: 21 July, 2009
|