కాంగ్రెస్ గూటికి రెహమాన్?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో సమసిపోయిందనుకున్న సంక్షోభం రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ఉద్యమాలు నిర్వహించేందుకు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్యంగా గడపడం వంటి పరిణామాలు అసమ్మతివాదుల ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ధ్వజమెత్తడం తెరాసలో నూతన పరిణామాలకు తెరలేచింది. కరీంనగర్ జిల్లాలో తెరాస అసమ్మతి వాదులు ఎ.చంద్రశేఖర్, జి విజయరామారావు వంటి వారు సమావేశం కావడం, వీరంతా కేసీఆర్ వ్యవహారశైలిపై మండిపడడం తెలిసిందే. ఈ మధ్య కరీనంగర్ పర్యటనకు వెళ్ళిన కేసీఆర్ తనకు సమాచారం ఇవ్వలేదంటూ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కేసీఆర్ పై కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అసమ్మతి వాదులు ఆయన మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలించి కెప్టెన్ ను కూడా తమ వైపునకు లాక్కున్నారు.
ఇంతకాలం కేసీఆర్ పై ఉన్న అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కని కెప్టెన్ తొలిసారిగా వెళ్ళగక్కారు. కేసీఆర్ పై గానీ, తెరాసపై గానీ తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని, కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహంతో పార్టీని ముందుకు నడిపిస్తారనే విషయాన్ని కేసీఆర్ వెల్లడించాలని మాత్రం కెప్టెన్ డిమాండ్ చేశారు. దీంతో కలవరపడ్డ కేసీఆర్ తెరాస సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ ను కెప్టెన్ వద్దకు పంపించారు. సోమవారం వరంగల్ లో కెప్టెన్ తో వినోద్ చర్చలు జరిపారు. వీరి చర్చల సారాంశం బయట పడనప్పటికీ కేసీఆర్ పై ఎటువంటి బహిరంగ వ్యాఖ్యానాలు చేయవద్దని వినోద్ కుమార్ కెప్టెన్ ను కోరినట్లు తెలుస్తోంది.
ఏవైనా అభిప్రాయాలుంటే కేసీఆర్ తో నేరుగా చెప్పగలిగే చొరవ ఉన్నా మీరు అసమ్మతివాదులకు అవకాశం ఇవ్వవద్దని కూడా వినోద్ కుమార్ లక్ష్మీకాంతరావుకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తారని, ఆ సందర్భంగా కేసీఆర్ తో ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చని కూడా వినోద్ కుమార్ కెప్టెన్ కు వివరించినట్టు సమాచారం. ఆషాడ మాసం పూర్తయిన వెంటనే పార్టీ సమావేశాలను ఏర్పాటు చేసి గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సమిష్టి నాయకత్వానికి పార్టీ బాధ్యతలు అప్పగించే వ్యవహారంపై మాట్లాడుకుందామని వినోద్ కుమార్ కెప్టెన్ కు చెప్పినట్లు సమాచారం.
Pages: 1 -2- News Posted: 22 July, 2009
|