విద్య ఉన్నతికి కమిటి
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో వేగంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోనూ రానున్న పదేళ్ళకు ఉన్నత విద్యారంగానికి ఒక స్వరూపాన్నిచ్చేందుకు, పాఠ్య ప్రణాళిక మొదలు అన్ని దశల్లో ఉన్నత విద్యాసంస్థలను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శాస్త్రవేత్తలను, విద్యావేత్తలను ఈ కమిటీలో చోటుకల్పించారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త కోట హరినారాయణ, విద్యావేత్త ప్రొఫెసర్ డి దయారత్నం వంటి వారు ఈ కమిటీలో ఉన్నారు.
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గలకు ప్రమాణాలతో కూడిన ఉన్నత, సాంకేతిక వృత్తి విద్యలను అందించేలా తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ప్రమాణాల విషయానికి వచ్చేసరికి అన్నింటికంటే వెనుకబడి ఉండటం గమనార్హం. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వందలాది కాలేజీలు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు పొందాయి. అలాగే నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్ గుర్తింపును చాలా విద్యాసంస్థలు పొందగా, ఈ విషయాల్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పులతో ప్రతి ఉద్యోగానికీ గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల్లో అవకాశాలు రోజురోజుకూ మృగ్యమైపోతున్నాయి.
Pages: 1 -2- News Posted: 23 July, 2009
|