నక్సల్స్ పై మెరుపుదాడి
హైదరాబాద్ : మావోయిస్టుల ఏరివేతకు వివిధ కేంద్ర పారామిలిటరీ బలగాల్లోని 26వేల మంది కమాండోలతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రా గ్రేహౌండ్స్ తరహాలో ఏర్పాటు చేయనున్న ఈ పోలీసు బలగాలకు పోలీస్ టాస్క్ ఫోర్స్ అని నామకరణం చేశారు. నక్సల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని నిలుపుకోవడం, అక్కడ చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం లక్ష్యంతో ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మిలిటరీ బలగాలను కూడా నియమించనున్నారు. కాని ఆర్మీ మాత్రం ఆపరేషన్లలో పాల్గొనదు. ఆపరేషన్లలో పాల్గొనే టాస్క్ ఫోర్స్ కు మాత్రం వ్యూహాత్మకమైన మద్దతును ఆర్మీ దళాలు ఇస్తాయి.
నక్సల్స్ నిర్మూలనకు కేంద్రం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ బలగాల ఏర్పాటు చేయనుంది. జిహాదీ ఉగ్రవాద సంస్థల తరహాలో మావోయిస్టు పార్టీ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఐ చైర్ పర్సన్ సోనియాగాంధీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం ప్రణాళికను ఖరారు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల రెండో వారంలో మొదట్లోనక్సల్స్ బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును నిర్వహించనున్నారు. 26వేల మందితో గ్రేహౌండ్స్ తరహాలో మెరుపుదళాన్ని ఏర్పాటు చేసి దీన్ని అదనపు డైరెక్టర్ జనరల్ ర్యాంకు ఆధీనంలో ఉంచనున్నారు. వీరికి మిలటరీ శిక్షణా సంస్థలు, ఇతర ప్రత్యేక పోలీసు శిక్షణా సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఈ విషయమై రాష్ట్రాల డిజిపిలను కేంద్రం సంప్రదించిందని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 23 July, 2009
|