జైలుకు పంపిన లాటరీ
టొరొంటో : అదృష్టం అంటే అదీ... లాటరీలో ఏకంగా పదమూడు కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టేశాడు. పాపం..దురదృష్టం వెంటాడింది. అప్పటి వరకూ అంటిపెట్టుకుని ఉన్న అదృష్టదేవత ముఖం చాటేసింది... చెక్కు అందుకోకుండానే చేతులకు బేడీలు పడ్డాయి..పోయి కటకటాల్లో పడ్డాడు. ఆనందంతో విందుల్లో మునిగితేలాల్సిన ఆ ఆకస్మిక కోటీశ్వరుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకూడు తింటున్నాడు. ఇది మన దేశంలో కథ కాదులెండి. మన దేశంలో అయితే కోట్లు వచ్చాయంటే ఎంతటి నేరస్థుడైనా క్షణంలో పెద్దమనిషి అవతారం ఎత్తేస్తాడు. రాజకీయనాయకుల నుంచి అధికారుల వరకూ వంగి సలామ్ లు కొడతారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఇచ్చేస్తారు. పోనీ ఇదలాంటి యూరో లాటరీ మాయాజాలం కూడా కాదు. నిజంగానే టొరొంటొలోని బార్రీ షెల్ అనే కెనడియన్ విషయంలో జరిగింది.
భారతీయులు ఎక్కువగా నివసించే బ్రాంప్టన్ నగరంలో ఈ బార్రీ షెల్ ఉంటున్నాడు. గత సోమవారం ఇతనికి 44.4 మిలియన్ అమెరికా డాలర్ల లాటరీ తగిలింది. ఒక్కసారిగా అపర కొటీశ్వరుడు అయిపోయాడు. కానీ ఏం లాభం చెక్కు తీసుకుని జేబులో పెట్టుకునే లోగానే పోలీసులు వచ్చి అయ్యవారి చేతులుకు అరదండాలు తగిలించారు. ఇంతకూ కథ ఏమిటంటే ఈయనపై 2003 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదురుచూస్తోందట. దొంగతనం, ఇతర సొమ్ములను అక్రమంగా కైంకర్యం చేయడం అనే నేరాలపై కోర్టు వారెంట్ జారీ చేసింది. కానీ ఈయన కోర్టుకు హజరు కాకుండా పోలీసుల కళ్ళు కప్పి తిరిగేస్తున్నాడు.. లాటరీ పుణ్యమా అని ఇంతకాలానికి దొరికిన షెల్ గారిని సెల్ లో వేసేశారు అక్కడి పోలీసులు.
Pages: 1 -2- News Posted: 24 July, 2009
|