`గోర్షకోవ్' కొను గోల్ మాల్
న్యూఢిల్లీ : అడ్మిరల్ గోర్షకోవ్ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు వినగానే సోవియట్ రష్యాలోని ఎర్రసైన్యం వీరుడనుకునేరు.. కానే కాదు. మన దేశంలో ప్రభుత్వపరంగా జరిగే ఖర్చులను పరిశీలించే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(కాగ్) పార్లమెంట్ కు సమర్పించిన నివేదిక ప్రకారం గోర్షకోవ్ అంటే భారతదేశం కొని తెచ్చుకున్న పెద్ద తద్దినం. మూలన పడిన ముసలమ్మ... ఇంతకూ అడ్మిరల్ గోర్షకోవ్ అంటే యుద్ధ విమానాలను మోసుకెళ్ళగలిగే నౌక...దీనినే విమాన వాహక నౌక అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నౌకాదళం కోసం మన రక్షణ శాఖ రష్యా నుంచి కొనుగోలు చేసింది.
అడ్మిరల్ గోర్షకోవ్ అనే ఈ నౌక రష్యా నౌకాదళం నుంచి ఎప్పుడో రిటైర్ అయిపోయింది. చాలా సంవత్సరాలుగా దీనిని పనికిరానిదిగా నిర్ణయించి రష్యన్లు మూలన పడేశారు. దీనిని మన ప్రభుత్వం ఏకంగా తొమ్మిది వేల వంద కోట్ల రూపాయలు పోసి కొనేశారు. కాగ్ అభిప్రాయం ప్రకారం ఈ డబ్బు పెడితే ఏ దేశం నుంచైనా కొత్త నౌకను కొనుక్కోవచ్చు. మనకు ఇంతవరకూ ఐఎన్ఎస్ విరాట్ అనే విమాన వాహక నౌక ఉండేది. అది 2007 లో నౌకాదళం నుంచి రిటైర్ అయిపోయింది. దాని స్థానంలో అడ్మిరల్ గోర్షకోవ్ ను కొన్నారు. 2008లనే ఇది మన దళంలో చేరాల్సి ఉంది. కాని మరో నాలుగేళ్ళు వరకు అంటే 2012 కు గాని ఇది భారత్ చేరదు. ఇదో పెద్ద నిరుపయోగ ఖర్చుగా కాగ్ తప్పుపట్టింది. అలానే ఫ్రాన్స్ కు చెందిన ఒక సంస్థ నుంచి ఆరు స్కోర్పేన్ జలాంతర్గాములను కొనుగోలులో కూడా సమస్యలు ఉన్నాయని కాగ్ గుర్తించింది. 18 వేల 798 కోట్ల రూపాయల ఈ ఒప్పందం అమ్మకందారునికి మేలు చేసే విధంగా ఉందని, ఇది చాలా తీవ్రమైన తప్పిదమని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
Pages: 1 -2- News Posted: 25 July, 2009
|