లేడీ అమితాబ్ జంపేనా?
హైదరాబాద్ : తెలుగు చలన చిత్రసీమలో రెబల్ పాత్రలను రక్తికట్టించి లేడీ అమితాబ్ గా పేరుపొందిన విజయశాంతి మరో రసవత్తర రాజకీయ నాటకానికి తెర తీశారు. సినిమా సినిమాకీ పాత్ర మారిపోయినట్టుగా విజయశాంతి కూడా రాజకీయాలలో పార్టీలను మారుస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లిపోయిన తరువాత ఈ తార భారతీయ జనతాపార్టీలో చేరారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పట్ల ఆకర్షితురాలై సొంత కుంపటి పెట్టుకున్నారు. తల్లి తెలంగాణ పార్టీ పేరుతో కొంతకాలం రాజకీయ కలకలం సృష్టించిన విజయశాంతి మొన్నటి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తెరాస లో పార్టీని విలీనం చేశారు. ఎన్నికల్లో దారుణమైన పరాజయాలు తెరాసను చీలికపేలికలుగా చేశాయి. మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి కీలకమైన నాయకులందరూ తెరాసను వదిలిపెట్టిపోయినా ఆమె కొంత కాలం పాటు కేసీఆర్ కు విధేయురాలుగానే కనిపించారు. చివరకు కేసీఆర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో విజయశాంతి కూడా తన సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా చేశారు.
ఆ తరువాత ఆమె ఆచూకీ ఆంధ్ర రాష్ట్రంలో కనిపించలేదు. కేసీఆర్ రాజీనామా ఉపసంహరించుకున్నా విజయశాంతి రాజీనామా గురించి ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తెరాస తాజా రాజకీయ పరిణామాలలో అసలు విజయశాంతి ప్రస్తావనే లేకుండా పోయింది. అలాంటి సమయంలో ఆమె ఒక్కసారిగా ముఖ్యమంత్రి వైఎస్ ను సచివాలయంలో కలిసి మీడియా దృష్టిని ఆకర్షించారు. దానికి తోడు తెరాస గురించి పన్నెత్తి మాట్లాడకపోవడం, తెలంగాణా భవనం వైపు కన్నెత్తి చూడకపోవడం బోలెడన్ని ఊహాగానాలకు తావిచ్చింది. వాటిని ఆమె ఖండించకపోవడం వాటికి బలాన్నిచ్చింది. విజయశాంతి క్రమంగా పార్టీకి దూరం అవుతున్నారా? కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా? శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన రోజున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలుసుకున్న ఆమె ఇటు పార్టీ నేతలకూ, అటు మీడియాకూ చిక్కటం లేదు. పార్టీ మారితే అందరికీ చెప్పిన తర్వాతే మారుతాను కదా అని వైఎస్‌ను కలిసిన తర్వాత చెప్పిన ఆమె పార్టీ కార్యాలయం తెలంగాణభవన్ వైపు ఇప్పటి దాకా కన్నెత్తి చూడలేదు.
దాదాపు నెల రోజుల తర్వాత అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చినప్పటికీ విజయశాంతి ఆవైపు చూడకపోవటంతో పార్టీశ్రేణులు, నాయకుల్లో అనుమానం బీజాలకు తెర పడింది. అంతకు ముందుసైతం ఆమె కార్యాలయానికి చాలా రోజుల నుంచే రావటం మానుకున్నారు. కెసిఆర్ అనారోగ్యంతోఉన్నారని తెలిసినా కనీసం ఆయనను పలకరించనైనా లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి, రెండు సందర్భాలలో కెసిఆర్ తనను కలిసిన సీనియర్ నేతలతో విజయశాంతిని గురించి అడిగినా వారికీ ఏ సమాచారం లేకపోవటంతో ఏమీ చెప్పలేకపోయారు.
Pages: 1 -2- News Posted: 27 July, 2009
|