గ్రేటర్ కు పవన్ వచ్చేనా?
హైదరాబాద్ : త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పక్షాన ప్రచార బాధ్యతను పార్టీ అధినేత చిరంజీవి సోదరుడు, యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను రూపొందించడంలో ఆపార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. గ్రేటర్ ప్రచారంలో పవన్ రావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయని, దీనికి అనుగుణంగానే పవన్ ప్రచారంలో పాల్గొంటాడని గతంలోనే చిరంజీవి వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించినా ఫలితాలు దారుణంగానే ఉన్న నేపథ్యంలో గ్రేటర్ లో సైతం ఆయన ప్రభావం ఎంత ఉంటుందన్నది ప్రశ్నార్థకమే.
కాని నగర పరిధిలో పవన్ కళ్యాణ్ అనుచరులు భారీగానే ఉండడం, ప్రచారాజ్యం కూడా గత ఎన్నికల్లో గణనీయమైన ఓట్లనే సాధించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ పదునైన వ్యూహాలను రూపొందిస్తోంది. శాసనసభ ఎన్నికల్లోనే ఘెరంగా దెబ్బతిన్న పార్టీ ప్రతిభను పున: ప్రతిష్టించేందుకు గ్రేటర్ ఎన్నికలను ఆయుధంగా వాడుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. 2014లో జరిగే సాధారణ శాసనసభ ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేయాలంటే స్థానిక సంస్థల్లో విజయం సాధించి పట్టును పెంచుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 27 July, 2009
|