మంత్రులకు వాస్తు భయం
హైదరాబాద్ : మన మంత్రులను వాస్తు భయం వణికిస్తోంది. జనం డబ్బుతో మరమ్మతులు చేస్తేనే గాని అధికార నివాసాల్లోకి వెళ్ళేది లేదని భీష్మంచుకు కూర్చున్నారు. బాబోయ్ మీ రు చెప్పినట్లు వాస్తు ప్రకారం ఈ భవనాలకు మరమ్మతులు చేస్తే మొదటికే మోసం వస్తుందని, ఈ భవనాలు బలహీన పడతాయని రహదారుల భవనాల శాఖ అధికారులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా ఆధునిక విజ్ఞానయుగంలోని మన మంత్రులు వినడం లేదు. ఇక్కడ బంజారా హిల్స్ లోని రోడ్ నంబరు పదిలో ఉన్న మంత్రుల నివాస భవన సముదాయంలో కేటాయించిన ప్రభుత్వ బంగ్లాల్లో కాపురం పెట్టడానికి మంత్రులు కలవరపడిపోతున్నారు. ఈ భవనాలను కేటాయించి నెల రోజులు గడిచిపోయినా వీరు మాత్రం తమ నెలవును ఇక్కడకు మార్చుకోలేదు.
వీరికి ఆషాఢ మాసం అడ్డొచ్చింది. ఆపై వాస్తు భయం పీడిస్తోంది. వాస్తు ప్రకారం వెంటనే ఈ భవనాలలో మార్పులు చేర్పులు చేయాలని వీరు అధికారులకు అధికారికంగా లేఖలు కూడా రాశారు. కొందరైతే ఏయే మార్పులు చేయాలో కూడా పండితులను కనుక్కుని మరీ లేఖల్లో వాటి వివరాలను పొందుపరిచారు. ఉదాహరణకు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఒకటో నంబరు భవంతిని కేటాయించారు. దీనిలో గతంలో మార్కెటింగ్ మంత్రి ఎం మారెప్ప ఉండేవారు. ఈ భవంతిని పరిశీలించిన మంత్రి వెంకటరెడ్డి అధికారులకు లేఖ రాస్తూ వాస్తు ప్రకారం తూర్పు వైపు కాకుండా పశ్చిమ దిశలో బేస్ మెంట్ నిర్మించాల్సిందిగా కోరారు. అలానే అటవీ శాఖ మంత్రి పి రామచంద్రారెడ్డికి మూడో నెంబరు గృహాన్ని కేటాయించారు. ఈయనా వాస్తు ప్రకారం కిటీకీలను మార్చాలని లేఖలో కోరారు. గతంలో ఈ క్వార్టర్ లో మంత్రి జి చిన్నారెడ్డి నివాసం ఉండేవారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ తనకు కేటాయించిన ఐదో నంబరు ఇంటికి కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఏ మార్పులన్నది చెప్పలేదు కాని వాస్తు ప్రకారం కొన్ని మార్పులు జరగాలని ఆయన వివరించారు. దీనిలోమంత్రి షబ్బీర్ అలీ గతంలో ఉండేవారు.
Pages: 1 -2- News Posted: 28 July, 2009
|