ముంబయి : ఈ జీతం గురించి విని కళ్ళు తేలేయకండి. కాస్సేపు ఊపిరి బిగపట్టండి. ఆయనేం నందన్ నీలేకనీ కాదు.. బిజినెస్ స్కూల్లో తెగ చదివేసిన అపర వ్యాపార మేధావీ కాదు...ఐటి ఉద్యోగం చేయట్లేదు. మీకు అందరికీ తెలుసుగా తీవ్రవాదుల దాడికి గురైన తాజ్ హోటల్. ఈ హోటల్లో పనిచేసే ఏ ఉద్యోగి అత్యంత ఎక్కువ జీతం తీసుకుంటున్నరో ఊహించగలరా? ప్రయత్నించండి. తాజ్ లో ప్రధాన నలభీముడైన కార్పోరేట్ ఛెఫ్ హేమంత ఒబరాయ్ కాదు. పోనీ ఈ హోటల్ ఆర్ధిక వ్యవహరాలను చూసే ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనిల్ గోయల్ అంతకంటే కాదు. తీవ్రవాదుల దాడుల సమయంలో అతిధుల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడిన హీరో జనరల్ మేనేజర్ కరంబీర్ సింగ్ కూడా కాదు... మరెవరు...ఇక్కడే కొంచెం మీరు ఊపిరి బిగపట్టండి...
ఆ ఉద్యోగి పేరు పిపి సహెర్. చేసే ఉద్యోగం బట్టలు ఉతకడం. తాజ్ లాండ్రీ డివిజన్ లో సీనియర్ ఆపరేటర్ అంతే. జీతం ఎంతో చెబుతాం.. కళ్లు తేలేయకండి... సంవత్సరానికి అక్షరాలా కోటిన్నర రూపాయలు. నెలకు 12 లక్షల 50 వేల రూపాయలు. రోజుకు ఎనిమిది గంటలు పనిచేసినందుకు 41 వేల 666 రూపాయలు. అంటే గంటకు ఐదువేల 208 రూపాయలు. సహెర్ తాజ్ అతిథులకు అనేక సంవత్సరాలుగా అందిస్తున్న అత్యంత విలువైన సేవలకు అతనికి ఆ వేతనం రావడం న్యాయమేనని తాజ్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. అవునండోయ్ సహెర్ కు మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది అదేమిటంటే ఆయన ఇండియన్ హోటల్ కంపెనీ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శి కూడాను. ఇంతకూ సహెర్ ఎన్ని డిగ్రీలు చదివేశాడనా మీ ప్రశ్న... అతను చదివింది కేవలం పదో తరగతి. బతుకులో చదివింది `పని శ్రీరామ రక్ష' అన్న మంత్రాన్ని. తాజ్ లో పని చేస్తున్న ఎంబిఎ ఉద్యోగుల కన్నా అనేక సందర్భలలో సహేర్ అత్యధికంగా సంపాయించాడు.