`దేశం'లో గౌడ సెగలు
హైదరాబాద్ : ఆంధ్రదేశంలోని రాజకీయ నాయకులంతా ఒక బళ్ళో చదువుకున్నవాళ్ళే. పార్టీలు వేరైనా రాజకీయ నాయకుల ఆలోచనలు ఒకలానే ఉంటాయని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అన్ని పార్టీల నుంచి ముఖ్య నాయకులను లాగేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినప్పుడు కాంగ్రెస్ లో అంతర్గతంగా అగ్గి పుట్టింది. ఇంతకాలం పార్టీ జెండాలను మోసిన తమపై ఆకర్ష పధకంలో భాగంగా వచ్చిన పెద్దలకు అందలం ఇస్తే తమ గతేమిటని కాంగ్రెస్ నాయకులు లబోదిబో మన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ ఆకర్ష్ కు వికర్షణగా తెలుగుదేశం నేత చంద్రబాబు పెట్టిన ఆపరేషన్ స్వగృహ కూడా ఇప్పుడు అదే చిచ్చును రగిలిస్తోంది.
కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసిపోయి నష్టం చేసిన వాళ్లను తిరిగి తీసుకుంటే ఎలా అంటూ అధినేత చంద్రబాబుపై తమ్ముళ్ళు తిరగబడుతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ గా ఉంటూ, ఉన్నట్టుండి పుట్టి ముంచిపోయిన తూళ్ళ దేవేందర్ గౌడ్ పునరాగమన వార్తలు ఆ పార్టీ సీనియర్లలో కంపరాన్ని పుట్టిస్తున్నాయి. వచ్చీరాగానే ఆయనను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వచ్చిన సమాచారంపై వారు భగ్గుమంటున్నారు. దేవేందర్ గౌడ్ రాక వల్ల పార్టీకి లాభదాయకమైనప్పటికీ, ఆయనకు వచ్చీ రాగానే పదవులు అంటకట్టడం భావ్యంగా ఉండకపోవచ్చునని తెలుగుదేశం సీనియర్లు తుమ్మల నాగేశ్వర్రావు, దాడి వీరభద్రరావు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 1 August, 2009
|