హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ సత్యశోధన పారంభించిన తొలినాళ్ళు అక్కడే గడిచాయి. ప్రపంచానికి సత్యాగ్రహమనే అంహిసాయుధాన్ని అందించేందుకు తొలి ఆలోచనల బీజాలు ఆయనకు అక్కడే పడ్డాయి. భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళిన ఈ యువ న్యాయవాది మూడేళ్ళు నివసించిన ఇల్లు. ఇప్పుడు వందేళ్ళ తరువాత ఆ ఇల్లు అమ్మకానికి పెట్టింది యజమానురాలు. దానిని స్వంతం చేసుకోడానికి ముంబయి బాంద్రాకు చెందిన వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. దానిని భారత ప్రభుత్వానికి కానుకగా ఇవ్వడానికి ఆయన నిశ్చయించారు.
పురాతన వస్తువులు సేకరించే అలవాటు ఉన్న ఈ వ్యాపారి పేరు ప్రదీప్ భవాని. ఈయన బిజెపి అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి మేనల్లుడు కూడా. కాని అలా పరిచయం చేసుకోవడం ఈ గాంధేయవాదికి ఇష్టం ఉండదు. జొహెన్నెస్ బర్గ్ పట్టణం శివార్లులో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ తాటాకు కప్పుగల బంగ్లాను రెండు కోట్ల 25 లక్షలు చెల్లించి కొనడానకి ప్రదీప్ భవాని సిద్ధమయ్యారు. ఈ ఇంట్లో మహాత్ముడు 1908 నుంచి 1910 సంవత్సరం వరకూ నివసించారు. దక్షిణ ఆఫ్రికాలోని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా పోరాటన్ని ప్రారంభించిన గాంధీ ఆ తరువాత బ్రిటీష్ కాలనీలోకి తన మకాంను మార్చారు.