వైఎస్ - బాబు ఒకటే దారి
వర్షాకాలం వచ్చినా ఎండలు మండిపోతున్నట్టు మనరాష్ట్రంలో ఎన్నికలైపోయినా ఫిరాయింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. సహజంగా ఎన్నికల కాలంలో కనిపించే ఈ ఫిరాయింపులు, గోడదూకుళ్ళు.... ఫలితాలు వెల్లడైన మూడు నెలలకు కూడా కొనసాగడం విశేషం. అధికార పక్షం విజయం సాధించిన ఆనందంలో కనీసం ఆర్నెల్లైనా 'ఊరేగడం' ఆనవాయితీ. కానీ ప్రస్తుత సీఎం వైఎస్ ఇప్పటి నుంచే 2014 శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడంతో మిగిలిన పక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కాలమ్ కనిపిస్తోంది. కళ్ళముందే కనిపిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల 'వైతరణి' దాటాలని ఉభయపక్షాలు తీవ్రంగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల తరువాత 2010లో వచ్చే మునిసిపల్, ఆపై పంచాయితీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉభయపక్షాలు తలపడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం నాయకత్వాలు ఏ అవకాశాన్నీ వదలడం లేదు.
'ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత నాది' అని అధిష్టానానికి హామీ ఇచ్చినట్లుగానే విజయలక్ష్మిని వైఎస్ వరించడంతో ఆయన మానసికంగా మరింత బలవంతులయ్యారు. కాంగ్రెస్ లో ఎన్నికల ముందు ఉన్న కొద్దిపాటి అసంతృప్తి కూడా ప్రస్తుతం లేశమాత్రమైనా లేదు. రాష్ట్రంలో వైఎస్ కు ఉన్న స్వేచ్ఛ, అపరిమిత అధికారం, స్వయం నిర్ణయాధికారం మచ్చుకైనా అసమ్మతిలేని పరిస్థితిలు... వెరసి గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ ఇంత సానుకూల వాతావరణం లేదని పార్టీలోని కొన్ని వర్గాలు నిట్టూర్పులు విడుస్తున్నాయి. కాంగ్రెస్ లో 'అసమ్మతి' 'ముఠా' సంస్కృతి రాజుకోలేదని కొన్ని పక్షాలు విస్మయం, అసూయ చెందుతున్నాయన్నా అతిశయోక్తిలేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత శాసనసభలో ఆధిపత్యం అరకొరగా ఉన్న కారణంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ మాటెలా ఉన్నా కాంగ్రెస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' తొలుత తెలుగుదేశాన్ని నల్లపునేని ప్రసన్న కుమార్ రెడ్డి రూపంలో ఇబ్బంది పెట్టింది. వెంటనే దీని తీవ్రతను గ్రహించిన తెలుగుదేశం విరుగుడుగా 'ఆపరేషన్ స్వగృహ' ప్రారంభించిందన్న సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కాంగ్రెస్ 'ఆకర్షణ' ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితిపై కేంద్రీకృతం అయింది. దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణాలో తాము బలోపేతం కావచ్చునన్నది కాంగ్రెస్ వ్యూహం.
Pages: 1 -2- News Posted: 4 August, 2009
|