ని`స్సహాయ' మంత్రులు న్యూఢిల్లీ : పనుల్లేక గోళ్ళు గిల్లుకుంటున్నారట... వాళ్ళేమీ నిరుద్యోగులు కాదు. తిని కూర్చోడానికి సోమరులూ కాదు... ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన వాళ్ళు అసలే కాదు. మన మంత్రులు. సాక్షాత్తూ కేంద్రంలో పదవుల భుజకీర్తులతో ఊరేగుతున్న సహాయమంత్రులు. పదవేదో ఉందన్న పేరు తప్ప చేయడానికి పని దొరక్క... కాదు..కాదు... పని ఇవ్వక పాపం ఖాళీగా... కుర్చీలకు అలంకారప్రాయంగా కాలం వెళ్ళదీస్తున్న నిస్సహాయ మంత్రులు. సీనియర్లైన కేంద్ర మంత్రుల చిన్నచూపుతో చిన్నబోతున్న వీరు పనివ్వండి మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకుని సహాయ మంత్రుల సహాయం తీసుకోండని సీనియర్లుకు సలహా ఇచ్చినా సహాయనిరాకరణ జరుగుతూనే ఉందనేది వీరి ఆక్రోశం.
రెండోసారి యూపియే అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది రెండో సారి కూడా సహాయ హోదాతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. డిఎంకే పార్టీకి చెందిన ఎస్ఎస్ పళనిమాణిక్కం సంగతే చూడండి. ఆయన అసంతృప్తితో, అసహనంతో, ఆగ్రహంతో కుతకుతలాడుతున్నారు. పదవి ఇచ్చి పని చెప్పకపోవడం అవమానమని గగ్గోలు పెడుతున్నారు. ఆయన ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కేంద్రమంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు తనకేమీ బాధ్యతలు కేటాయించలేదని కరుణానిధికి ఫిర్యాదు చేస్తే ఆయన సోనియా చెవిన వేశారు. అప్పుడ ఏవో నాలుగైదు ఫైళ్ళు ఆయన టేబిల్ మీదకు వచ్చేవి. ఇప్పుడు పెద్ద తలకాయి ప్రణబ్ ముఖర్జీ రావడంతో పళనిమాణిక్కం పని మళ్ళీ మొదటికొచ్చింది. మనుషులు మారినా ఫలితం లేకుండా పోయిందని పళనిమాణిక్కం వాపోతున్నారు.
సహాయ మంత్రులు అందరూ ఇంచుమించు నిస్సహాయ మంత్రులుగానే మిగులు తున్నారని యూపియే ప్రముఖులే చెబుతున్నారు. పాపం అరుణ్ యాదవ్ కథే చూడండి. గతంలో ఆయన క్రీడల శాఖకు సహాయ మంత్రి. దాని కేబినెట్ మంత్రి ఎంఎస్ గిల్ యాదవ్ ను ఉత్సవ విగ్రహం గానే ఉంచారు. కిందా మీదా పడి యాదవ్ ఈసారి భారీ పరిశ్రమల శాఖను ఎంచుకుంటే దాని సీనియర్ విలాస్ రావ్ దేశ్ ముఖ్ అన్ని పనులూ తానే చక్కబెట్టు కోవడంతో యాదవ్ గోళ్ళు గిల్లుకోవడం మినహా ఏమీ దక్కలేదు. కాకపోతే సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నరో అధినేత్రి కి తెలుసన్న సంతృప్తి మాత్రం వారిలో మిగిలింది. సహాయ మంత్రులను కుర్చీలు నింపే అలంకార ప్రాయులుగా మిగల్చకండి అంటూ ఇటీవల సీనియర్ మంత్రులకు సోనియా చెప్పారని పార్టీ వర్గాలు వివరించాయి. కొందరు సీనియర్లు మరీ ముదుర్లు కావడంతో వారి సహాయ మంత్రులు బాధితులుగా మారారని అంటున్నారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మాకెన్, ఐటి, టెలికాం సహాయ మంత్రి గురుదాస్ కామత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అరుణ్ యాదవ్ ఈ బాధితులని అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 11 August, 2009
|