కాంగ్రెస్ కు 'ఫుడ్ ప్రాబ్లం'! న్యూఢిల్లీ : రెండోసారి అధికారంలోకి వచ్చిన సంతోషాన్ని కాంగ్రెస్ ఆస్వాదించలేకపోతోంది. వరుణదేవుని సహాయ నిరాకరణతో దేశంలో ఏర్పడ్డ ఆహారకొరత కాంగ్రెస్ ను కొండంత కలవర పెడుతోంది. రానున్న పండుగల సీజన్లో సామాన్యులు 'పిండివంటలు' వండుకోవాలన్నా చెక్కర, పప్పుదినుసుల ధరలను పెరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కు పులిపై సవారీలాగా కనిపిస్తోంది. లేదంటే ఈ ఏడాది జరిగే మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తలబొప్పి కట్టే ప్రమాదం ఉంది! కాంగ్రెస్ ఇంతగా కలవర పడడానికి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో వర్షపాతం తక్కువగా నమోదు కావడమే. దీంతో వరి, ఇతర పప్పు దినుసులు, చక్కెర ధరలు చుక్కలనంటకుండా చూడడం ఎలాగన్నది కాంగ్రెస్ ను వేధించనుంది.
గతంలో ఉల్లి ధరల ఘాటికి ప్రభుత్వాలు మారిన వైనం ఆ పార్టీకీ బాగా తెలుసు. 20 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ హయాంలో ఇటువంటి పరిస్తితి ఉత్పన్నం అయినప్పుడు అనుసరించిన నివారణ పద్ధతులను అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. ఆ సమయంలో 'ఆయిల్ సీల్స్ టెక్నాలజీ మిషన్' ను రాజీవ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు కార్యాచరణ నమూనాను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అపరాలు, పంచదారను దిగుమతి చేసుకోవడంతో పాటు వంట నూనెల ఎగుమతులపై నిషేధం విధించాలి. అదే విధంగా నిత్యావసర వస్తువులపై 'ఫ్యూచర్ ట్రెడింగ్'ని నిషేధించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షపాతం తక్కువై వరి ఉత్పత్తిని ప్రభావితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నా... ఆహారధాన్యాల నిల్వలున్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
మరోవైపు చెరకు దిగుబడి తగ్గడంతో పంచదార ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో 30 లేదా 40 లక్షల టన్నుల పంచదారను భారత్ దిగుమతి చేసుకోవాలి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో చక్కెర ధర చేదెక్కడం ప్రారంభమైంది. ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడిన కారణంగా గతంలో వలె పాకిస్తాన్ పై భారత్ ఆధారపడలేదు. కొరత భయంతో పాక్ లో కూడా చక్కెరకు డిమాండ్ పెరిగింది. అపరాల విషయంలోనూ ఇదే పరిస్థితిని బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎదుర్కోవల్సి ఉంటుంది. దరిమిలా , ఇతర మార్కెట్లపై భారత్ ఆధారపడవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
Pages: 1 -2- News Posted: 11 August, 2009
|