పీఆర్పీనీ 'అల్లు'కున్న వివాదం! హైదరాబాద్ : 'నేను సైతం ప్రజాసేవకు సమిధ నొక్కటి ఆహుతిస్తాను' అంటూ 'ప్రేమే మార్గం - సేవే లక్ష్యం'గా రాజకీయ అరంగేట్రమ్ చేసిన మెగా స్టార్ చిరంజీవి తరచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. అభిమానుల కేరింతలు, శ్రేయోభిలాషుల దీవెనల మధ్య గత ఆగస్ట్ 26న తిరుపతిలో 'ప్రజారాజ్యాని'కి ఓపెనింగ్ క్లాప్ కొట్టిన 'మెగా'నటుడు ఏడాది గడిచేసరికి 'పార్టీకి క్లోజ్ క్లాప్' కొడుతున్నట్లు ప్రచారంలోకి రావడం విచారకరం. విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ ఎన్టీఆర్ తరహా పార్టీని నెలకొల్పిన కొద్ది కాలంలోనే అధికారంలోకి రావాలన్న అభిమానుల ఆకాంక్ష నెరవేరలేదు. కనీసం అధికారానికి చేరువగా కూడా రాకపోవడం అభిమానుల కన్నా... 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ప్రజారాజ్యమేనన్న అంచనాలతో పార్టీలోకి చేరిన ఇతర పార్టీలవారిని మరింతగా నీరుగార్చింది.
కాంగ్రెస్ వైపు నుంచి ప్రజారాజ్యంలో చేరినవారు... అక్కడే ఉంటే 'బాగుండేది కదా' అనుకునే పరిస్థితి, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలో చేరినవారు మనం పూర్వాశ్రమంలోనే ఉంటే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చేదేమో? అన్న శంక మొదలైంది. ఎన్నికల తరువాత ప్రజారాజ్యం సంస్థాగతం గా బలోపేతం అవుతున్న సూచనలు కనిపించకపోవడంతో, పీఆర్పీలోకి పెద్ద ఎత్తున అంచనాలతో వచ్చినవారికి - తాము 'రెంటికీ చెడిన రేవణ్ణలు'గా మారామని భావించారు. పీఆర్పీ నుంచి వలసలు ప్రారంభానికి నేపథ్యంగా చూడాలి.
ఇదంతా ఒక ఎత్తైతే - ఎన్నో అంచనాలతో ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రధానంగా చిరంజీవి - ఆయన బావ సామ్రాజ్యాన్ని జయించే 'నర నారాయణలు'గా అభిమానులు ఆశించారు. ప్రజల్లో ఆదరణ పెంచేందుకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీని బలంగా మలిచేందుకు చిరంజీవి ఎండనకా, వాననకా జిల్లాల్లో పర్యటించారు. వ్యూహాత్మకంగా పేరొందిన బావ అల్లు అరవింద్ - హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
అదే సమయంలో టికెట్ల పంపిణీలో పలు ఆరోపణలు అల్లు పై వచ్చాయి. టిక్కెట్లు ఇవ్వడానికి వసూళ్ళు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అలాగే చిరంజీవికి సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు రాలేదని, పవన్ కళ్యాణ్, నాగబాబుల వర్గానికి కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదన్న ఆరోపణలు ఎన్నికల సమయంలో వచ్చాయి. దానికి తగ్గట్టే ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్, నాగబాబుల పాత్ర పార్టీలో తగ్గింది. షూటింగ్ ల కారణంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నట్లు పవన్ కళ్యాణ్, తదితరులు ప్రకటించినా ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. 'తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే - దూడ గడ్డి కోసం' అని చెప్పినట్లుగానే ఉంటోంది.
Pages: 1 -2- News Posted: 21 August, 2009
|