మాజీ ఐటీల క్రెడిట్ తిప్పలు చెన్నై : అసలే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోడానికి నిప్పడిగాడట మరొకడు... అలా ఉంది... ఆర్ధిక మాంద్యం పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకున్న ఐటి రంగం నిపుణుల పరిస్థితి. ఉద్యోగం పోయి తనకు, కుటుంబానికి తిండి కోసం తిప్పలు పడుతుంటే అప్పులు తీర్చమని బ్యాంకులు వారి వెంట పడుతున్నాయి. వేల లక్షల రూపాయలు జీతం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని క్రెడిట్ కార్డులను వాడేసిన వారి వాకిట్లో బ్యాంకు ఏజెంట్లు కాపాలా కాస్తున్నారు. ఈ ఏజెంట్ల పెట్టే చిత్రహింసలు భరించలేక, బెదిరింపులు పడలేక వందలాది మంది ఐటీ రంగం మాజీ ఉద్యోగులు ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీరికి సహాయం అందించడానికి క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆ సంస్థ కార్యదర్శి సివి గిదప్ప చెప్పారు. దాదాపు మూడు వందల మంది ఐటి మాజీలు వివిధ కోర్టులలో బ్యాంకులకు వ్యతిరేకంగా కేసులు వేసారని, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న బ్యాంకుల వేధింపుల నుంచి కాపాడమని కోరుతున్నారని ఆయన వివరించారు.
ఇలాంటి కొన్ని కేసులలో ఇంజెంక్షన్ ఉత్తర్వులు పొందగలిగామని, మరికొన్ని కేసులలో బ్యాంకులకు కోర్టులు ఎమర్జెన్సీ నోటీసులు పంపాయని గిదప్ప చెప్పారు. అలానే బ్యాంకులకు, బకాయిదారులకు మధ్య సంప్రదింపులు చేయడానికి కొన్ని కేసులను మధ్యవర్తిత్వ కేంద్రాలకు పంపించినట్లు ఆయన వివరించారు. గడిచిన మూడు నెలలో 1040 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్న ఐటి నిపుణులు తమ సంస్థలో సభ్యులుగా చేరారని చెప్పారు. వీరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాలలో ఉద్యోగాలు చేసేవారని వివరించారు. క్రెడిట్ కార్డ్ బకాయిదారుల సమస్యలకు వీలైనంత పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన వివరించారు.
Pages: 1 -2- News Posted: 21 August, 2009
|