విఫలమైన 'పాన్' న్యూఢిల్లీ : గుప్త ధనాన్ని అరికట్టడానికి అధిక విలువ గల లావాదేవీలన్నిటికీ పాన్ (పర్సనల్ అకౌంట్ నంబర్) వాడకాన్ని తప్పనిసరి చేయడం ఒక ముఖ్యమైన మార్గమని ప్రభుత్వం భావించింది. కాని అలా జరగడం లేదని ఆదాయపు పన్ను (ఐటి) శాఖ ఇప్పుడు గ్రహించింది.
ప్రభుత్వానికి సమర్పించిన వార్షిక సమాచార నివేదిక (ఏన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ - ఎఐఆర్) ప్రకారం, 2007-08 సంవత్సరంలో అధిక విలువ గల లావాదేవీల పరిమాణం రూ. 55.7 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరపు మొత్తం రూ. 27 కోట్ల కన్నా దాదాపు రెట్టింపు ఉన్నది. కాని దాదాపు 30 శాతం లేదా 3.3 కోట్ల లావాదేవీలలో సుమారు పది లక్షల లావాదేవీలలో పాన్ ను ఉటంకించనే లేదు. అధిక విలువల గల లావాదేవీలు చాలావరకు అనుమానాస్పదమైనవని ఐటి శాఖ భావిస్తున్నది. రూ. 30 లక్షలు, అంతకు మించిన ప్రకటిత విలువ గల ఆస్తుల అమ్మకాలలో పాన్ ను ఉటంకించనే లేదు. అటువంటి విక్రేతలు ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే పాన్ ను ఉటంకించారు.
అదే విధంగా సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో రూ. 10 లక్షలు, ఆ పైన నగదు డిపాజిట్లు గల వారరిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది బ్యాంకుకు పాన్ ను అందజేయలేదు. రూ. 2 లక్షలు, అంతకు మించిన క్రెడిట్ కార్డు లావాదేవీలలో సగం పైగా పాన్ ను ఉటంకించనివే. మరీ దిగ్భాంతికరమైన విషయమేమంటే, ఆర్ బిఐ బాండ్లలో రూ. 5 లక్షలు, ఆ పైన మదుపు పెట్టిన, మొత్తం రూ. 3. 52 లక్షల కోట్ల విలువ గల 3100 లావాదేవీలలో దాదాపు పది శాతం పాన్ ప్రస్తావన లేకుండానే జరగడం.
పాన్ ను అందజేయకపోవడం ఒక్కటే ఈ శాఖ అనుమానాలకు కారణం కాదు. పాన్ ను అందజేసిన వేలాది కేసులలో అసలు లావాదేవీ లబ్ధిదారుని ఈ శాఖ కనిపెట్టలేకపోవడం కూడా కారణం. కొన్ని కేసులలో ఇచ్చిన పాన్ నంబర్ నకిలీదిగా తేలింది. మరి కొన్ని కేసులలోల ఒకే వ్యక్తి రెండు లేదా అంతకు ఎక్కువ పాన్ లను ఉపయోగించారు. అటువంటి ఒక కేసులో ఐటి శాఖ మరింత లోతుగా దర్యాప్తు జరిపినప్పుడు, రెండు పాన్ లు కలిగి ఉన్న ఒక మహిళ ఆదాయం రూ. 40 కోట్లకు పైగా ఉంది. కాని ఆమె ఆ సంవత్సరం తన రిటర్న్ లో ఏ ఆదాయాన్నీ వెల్లడించలేదు.
అమెరికా ప్రధాన కేంద్రంగా గల ఒక ప్రముఖ బ్యాంకుది మరొక ఆసక్తికరమైన కేసు. క్రెడిట్ కార్డులకు సంబంధించి ఆ బ్యాంకు అందజేసిన సమాచారం ప్రకారం, కేవలం నాలుగు పాన్ లతో వేలాది కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరిగాయి. దీనిపై ఆ బ్యాంకును తరచి తరచి ప్రశ్నించగా, అది లోపభూయిష్టమైన డేటా ఎంట్రీ కేసుగా బ్యాంకు వివరణ ఇచ్చింది.
Pages: 1 -2- News Posted: 24 August, 2009
|