రాహుల్ కు పవర్ లాభించేనా న్యూఢిల్లీ : కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంపై యువరాజు రాహుల్ గాంధీ ముద్ర లేదని భావిస్తున్న కాంగ్రెస్ వర్గాలకు లాభదాయక పదవులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆయాచిత వరంలా లభించింది. లాభదాయిక పదవిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సలహా మండలి (ఎన్ ఏసి)ని పునరుద్దరిస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎంపీలు లాభదాయక పదవులు నిర్వహించడంపై 2006లో వివాదం తలెత్తడంతో ఎన్ ఏసీ చైర్మన్ పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక సోనియా, మన్మోహన్ సింగ్ కు తోడుగా రాహుల్ మూడో అధికార కేంద్రంగా, కాంగ్రెస్ పార్టీ పై రాహుల్ ముద్ర ప్రబలమవుతున్న తరుణంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. అధికారం చెలాయించేందుకు తగిన 'స్థానం' లేని కారణంగా ప్రభుత్వంపై తనదైన 'ముద్ర'ను వేసే అవకాశం రాహుల్ కి లభించడం లేదు. యూపీఏ తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు ప్రభుత్వం అమలు చేసిన సామాజిక ప్రాజెక్టులు... ఉపాధిహామీ, సమాచారహక్కు, ఆరోగ్యపధకాల అమలుకు ఎన్ ఏపీ ఛైర్మన్ హోదాలో సోనియా ప్రభుత్వానికి మార్గదర్శనం చేశారు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన క్రమంలో పునరుద్ధరించే ఎన్ ఏసీ కి నాయకత్వం వహించాల్సింది సోనియానా లేదా రాహులా అన్న అశంపై కాంగ్రెస్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు వీలుగా వ్యవస్థాగతమైన కమిటీలో తల్లీ, తనయులకు స్థానం కల్పించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వెలుపల - తల్లీ, కొడుకుల ఫార్ములాకు సోనియా సుముఖంగా లేరు. 'ప్రభుత్వ విధానాలకు రాహుల్ సమ్మతి కావాలంటే అందుకు అవసరమైన 'అధికార హోదా' లేని సంగతిని కాంగ్రెస్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆయన తన ప్రతిపాదనలను 'బుందేల్ ఖండ్ అభివృద్ధి కమిటీ' లాగా ప్రతినిధుల ద్వారా సూచించాలి. ఈ ప్రయత్నాలు రాజకీయ రంగు పులుముకున్నాయి' అని కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. బుందేల్ ఖండ్ ప్రతిపాదన విఫలమైన నేపథ్యంలో రాహుల్ కు 'అధికార హోదా కల్పించాలని కార్యకర్తలు తొందరపడుతున్నారు. కీలకమైన అంశాలపై ప్రధాని, రాహుల్ కు మధ్య అవగాహన ఉందని, ప్రభుత్వానికి 'వారసుని'గా కనిపించేందుకు రాహుల్ సుముఖత చూపడం లేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి. 'రాహుల్ జోక్యం ఉన్నట్టు ఏమాత్రం కనిపించినా ఆయనకు ప్రధాని పదవి కట్టబెట్టాలన్న వాదన పార్టీ చేతినుంచి జారిపోతుంది. ఆ పరిస్థితిని ఆయన కోరుకోవడం లేదు అని ఆ వర్గాలు తెలిపాయి.
Pages: 1 -2- News Posted: 26 August, 2009
|