హిజ్రాలకు పెళ్ళి వెబ్ సైట్ అందమైన యువతి, స్వేచ్ఛగా జీవిస్తున్న కల్కీ సుబ్రమణియన్ తనను కూడా ప్రేమించగల, మంచి సహచరునిగా ఉండగల, చదువుకున్న పురుషుని కోసం ఎదురుచూస్తున్నది. కాకపోతే అలా ముందుకు వచ్చే వరుడు తృతీయలింగ స్త్రీ లక్షణాలతో ఉన్న కల్కిని వివాహం చేసుకోడానికి సిద్ధపడాల్సి ఉంది. తనకు తగిన వరుడిని వెదుక్కునే వరకూ ఆమె డీలా పడదలచుకోలేదు. అందుకే ప్రపంచంలోనే ఒక అరుదైన, వినూత్నమైన వివాహాల వెబ్ సైట్ గురువారం ప్రారంభం అయింది. శిఖండి, బృహన్నల లక్షణాలతో ఉండే స్త్రీలకు పెళ్ళి సంబంధాలు వెదికేందుకు ఉద్దేశించిన ఈ వెబ్ సైట్ ప్రపంచంలోనే ఈ తరహా వాటిలో మొదటిది కావడమే విశేషం. పురుషునిలా జన్మించి తరువాత శారీరకంగా, మానసికంగా స్త్రీ లక్షణాలతో ఉండే తృతీయలింగం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న సహోదరి ఫౌండేషన్ ఈ వెబ్ సైట్ ను రూపొందించింది. దీని వ్యవస్థాపక డైరెక్టర్ కల్కీ సుబ్రమణియన్ కావడమే ఆమె పట్టుదలకు నిదర్శనం.
ఈ వెబ్ సైట్ వలన అయినా తమలాంటి వారి వివాహలు, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది కల్కీ. తృతీయలింగ మనుషులు మరింత సహజంగా, మంచిగా జీవనం సాగించేందుకు చట్టపరమైన స్పష్టత కావాలని ఆమె వాంఛిస్తోంది. సమాజంలో ఎంతోకాలంగా తాము వివక్షకు, దోపిడీకి గురవుతూనే ఉన్నామని కల్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పెళ్ళిసంబంధాల వెబ్ సైట్లకు భిన్నంగా తృతీయలింగ లక్షణాల వారు తమకు తగిన తృతీయలింగం వారిని ఎంపిక చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరునంగై డాట్ నెట్ లో పేరు రిజిస్టర్ చేసుకుంటే తృతీయలింగ లక్షణాల స్త్రీలకు వారి కలల రాకుమారుడిని జీవిత భాగస్వామిగా చేసుకునే అవకాశం లభించవచ్చు. ఇంతకూ తిరనంగై అంటే తమిళ భాషలో `గౌరవనీయరాలైన స్త్రీ' అని అర్ధం.
Pages: 1 -2- News Posted: 27 August, 2009
|